Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం పలు చోట్ల వర్షం కురిసింది. మణికొండ, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగ్, శంషాబాద్, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. పలు చోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
సికింద్రాబాద్‌లో అత్యధికంగా 74.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ముషీరాబాద్‌లో 73 మి.మీ., రామచంద్రాపురంలో 68.5 మి.మీ., కూకట్‌పల్లిలో 64.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల్లో వర్షపాతం పరిశీలిస్తే.. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 93.5 మి.మీ., నాగర్‌కర్నూల్ జిల్లాలో 87 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఆగస్టు 17వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Shadnagar Incident | దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. షాద్‌నగర్ డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు
Nagarjuna Sagar | నిండుకుండలా నాగార్జున సాగర్.. 4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
Professor Kodandaram | ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్