షాద్‌నగర్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్‌లో (Shadnagar Incident) పోలీసులపై కేసు నమోదయింది. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ రికార్డు శారు. ఇప్పటికే అంతకముందు ఈ ఘటనలో డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
షాద్‌నగర్‌లోని అంబేద్కర్‌కాలనీలో నివాసముండే నాగేందర్ ఇంట్లో 22 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీకి గురైందని గత నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి పక్కన కూలి పనిచేసుకొని బతికే సునీత, భీమయ్య దంపతులను అనుమానించాడు. కేసు నమోదు చేసుకున్న షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి బృందం.. భీమయ్య, సునీతను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ రోజు భీమయ్యను వదిలేసి 9వ తరగతి చదువుతున్న వాళ్ల కొడుకును పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, తల్లితో పాటు లాకప్‌లో కూర్చోబెట్టారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు బాధితురాలు తెలిపింది. తన కొడుకు ముందే బట్టలు విప్పించి, చెడ్డీ తొడిగి కాళ్ల మధ్య కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ చిత్రహింసలకు గురిచేశారని, కొడుకును కూడా అరికాళ్లపై రబ్బర్ బెల్ట్‌తో కొట్టారని, పోలీసుల దెబ్బలకు తాళలేక మూర్ఛపోతే తన కొడుకుతో జండూబామ్ రాయించి, ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని వివరించింది.
అనారోగ్యంతోనే వారం పాటు తాము ఇంట్లో నుంచి బయటకు రాలేదని, లాకప్ విషయాన్ని ఎవరికీ చెప్పొందంటూ పోలీసులు బెదిరించారని వాపోయింది. ‘నైటు తీస్కపోయి ఫస్టు మా ఆయినను కొట్టిన్రు.. ఆయనను బయటకు పంపి నన్ను దీస్కపోయిన్రు. బట్టలన్నిప్పేశిర్రు. ఆఫ్ నిక్కరేశి ఎడ్మకాలు అక్కడ జాపిర్రు.. కుడికాలు ఇక్కడ జాపిర్రు.. కట్టోటి పెద్దదివెట్టి చేతులు ఎన్కకుగట్టేశి కాళ్లు జాపిపిచ్చిర్రు. కాళ్లు కట్టేశి ఓ పెద్ద కట్టెవెట్టి ఓ సారు ఇక్కడ కాలువెట్టిండు.. ఓ సారు కట్టెమీద కాలు వెట్టిండు. మేడం మధ్యల నిలవడి నెత్తిరికిచ్చుకున్నది. ఒగసారును ఎన్కగూసుండవెట్టిర్రు. ఇగ కొడ్తావుండ్రు సారూ.. అంత ఘోరం మాత్రం కొట్టొద్దు సారూ.. మస్తు గొట్టిర్రు సారూ.. బట్టలిప్పిగొట్టిర్రంటే ఆడపిల్లను. నేను చేయని శిక్ష అనుభవిస్తున్న.. నాకివి ఒద్దు సారూ.. మీ కాళ్లుమొక్కి పదిరూపాలడుక్కొని బతుకుతగానీ, నేనిట్లాంటి పనిజేయను, నాకు ఎన్క ఆపిరీషనైంది. నా మొగనికి పానం మంచిగలేదు. నాకు కాలిరిగిపోయింది సారు అంటెగుడ నమ్ముతలేరు సార్. ఒక సారేమో ఎదను ఏశీఏశీ తన్నిండు. దమ్మొస్తుంది నాకు మాట్లాడాలంటే. ఇష్టమొచ్చినట్టు పట్టపట్ట శెయితోని కొట్టిర్రు. కాలు దగ్గరికి గుంజుకుంటే.. కాలు దగ్గరికి గుంజుకుంటున్నవేమే? అంట మళ్ల కట్టేసి కొట్టిర్రు సారు. తొమ్మిదీటి నుంచి రెండు గంటల వరకు కొట్టుడూ నడిపియ్యుడు.. కొట్టుడూ నడిపియ్యుడూ! నాకు నడ్వనీకొస్తలేదు.
నోరెండుకపోతున్నది. కొంచం నీళ్లతడి చేయ్యిర్రంటే.. కొంచెం నీళ్ల తడి చేస్తుర్రు, కొడుతుర్రు. ఓంబత్తీలు తెచ్చి కొడ్దము కాల్చియ్యి అని సారువాళ్లంటే ఇట్లోంటిదానికైతే నేనెళ్లిపోతా అని మేడం ఎళ్లిపోయింది. ఎందుకెళ్లిపోతున్నవ్ నువ్ రా నువ్ రా జరసేపు రా అని మేడానికి ఫోన్ జేసి రమ్మంటే నేనుండను మీరట్లజేస్తానంటే అని ఆ మేడం ఎళ్లిపోయింది సారు. అందరు మొగ పోలీసోళ్లే కొట్టిన్రు.. ఒక్క ఆడపిల్ల మాత్రం నన్ను కొట్టలేదు. శేతులు ఏం అననీకొస్తలేవు. కాళ్లు దగ్గరికొస్తలేవు. శేతులు ఇట్ల వెట్టిపిచ్చి గాజులన్ని పీకిన్రు. ఆ దెబ్బలకు ఓపెనైపోయి ఎవరెవరియో పేర్లుగుడ చెప్పిన్నంట. నాకైతె మతిలేదు సారూ. మీ కాళ్లు మొక్కుత నన్నెట్లనో బైటెయ్యిర్రి. ఈ దొంగతనం జేసినట్టుంటే నేనాన్నే సచ్చిపోత సారు. కని ఆళ్లింట్లకెళ్లి మాత్రం సక్కగ ఎంక్వైరీ చేసుకొచ్చి నా ఇంట్ల ఎవరు వెట్టిర్రో అదొక్కరు గుర్తుదేల్చుమను, నేను దీశినట్టుంటే నేను మీముందట్నే సచ్చిపోత సారు నేను. పెద్దసారనేటాళ్లు ఎవరో ఎమ్మో. పెక్కపెక్క తన్నిర్రు. దమ్మెల్తలేదని నిన్న దావఖానకు పోదామని అనుకున్నం. బైటికెళ్లనిస్తలేరాళ్లు. పిట్రోల్వోశి అంటువెడుతం బిడ్డా.. నువ్వెట్ల బైటికెళ్తవు? నీ మొగొన్ని నిన్ను. నీ బిడ్డని, నీ కొడుకును పిట్రోల్ పోశి అంటువెడ్తం.. నువ్వెట్ల బైటికెళ్తవో సూస్తనే.. మా బంగారం మాకు దెచ్చియ్యే అనంటే నేనేంజేత్తు సారు’ అని బాధితురాలు మీడియా ఎదుట తన గోడువెళ్లబోసుకున్నది.