హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram), ప్రముఖ జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు మంత్రులు అభినంతనలు తెలియజేశారు. అసెంబ్లీ కార్యదర్శి వారికి రూల్ బుక్ అందజేశారు.
అనంతరం ప్రొఫెసర్ కొదండరాం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి, గవర్నర్, మండలి చైర్మన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను ఎమ్మెల్సీగా కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ కావడం అదనపు బాధ్యత మాత్రమేనని భావిస్తున్నాని తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల ఆంక్షల మేరకు పనిచేస్తానని వెల్లడించారు. అనేకమంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నామన్నారు.