కనీసం రూ.100 కోట్లయినా వసూలు చేయండి
బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లపై ఉన్నతాధికారుల ఒత్తిడి
జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతుంటే…వచ్చే నెలలోనైనా కనీసం 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా చివరి వారంలో బల్దియా ఆరాటపడుతున్నది. కానీ జీహెచ్ఎంసీ ఆర్థిక విభాగం ఆరాటం.. ఆచరణలో సాధ్యపడటం లేదు.. దీనికి కారణం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బల్దియాను ఆదుకోవడంలో ప్రభుత్వం ‘చే’తులెత్తేయడమే.. ఈ పరిస్థితుల్లో ఖజానాను స్వతహాగా బలోపేతం చేసుకునేందుకు ఆస్తిపన్ను వసూలు చేస్తేనే జీతాలు ఇస్తామంటూ కొత్త రాగం ఎత్తుకోవడం ఉన్నతాధికారులకే చెల్లింది.
-సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)
జీహెచ్ఎంసీ ఖజానా నానాటికీ బక్కచిక్కిపోతున్నది.. వాస్తవంగా సంస్కరణలతో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల మెరుగుదల, నిర్మాణ రంగ అనుమతుల ద్వారా ఆదాయం, ఖర్చుల భారం తగ్గించుకోవడం.. కానీ ఆస్తిపన్ను వసూళ్లలో కొందరి బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల చేతివాటం, రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్ కేటగిరీలోకి మారిన భవనాలపై ఫోకస్ చేయకపోవడం, కొత్త భవనాల అసెస్మెంట్లో నిర్లక్ష్యం , దాదాపు రూ. 6,900 కోట్ల ఆస్తిపన్ను బకాయిల రాబడిలో పనితీరు శూన్యమనే చెప్పాలి. ఇక గతంలో కంటే నిర్మాణ రంగ అనుమతులు తగ్గడం, ఇప్పటి వరకు రూ.200 కోట్ల మేర లోటు ఏర్పడింది. ఇక ఖర్చుల భారం తగ్గించుకోవాల్సిన సమయంలో ఒకవైపు కార్పొరేటర్లు ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం పేరిట టూర్లు వేయగా, దాదాపు రూ.కోటిన్నర ఖర్చు కావడం కొసమెరుపు.
కమిషనర్ నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో లోపంతో జీహెచ్ఎంసీ పాలన గాడి తప్పింది. పౌరుల మౌలిక సదుపాయాల కల్పన దేవుడెరుగు, ఉద్యోగుల నెలవారీ వేతనాలు సకాలంలో వచ్చే పరిస్థితులు లేవు. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ఆర్థిక విభాగం నానా తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉన్నతాధికారులు ఆస్తిపన్ను బకాయిలు, నెలవారీ టార్గెట్లు పూర్తి చేయాలంటూ బిల్ కలెక్టర్లు , ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోగా రూ. 100కోట్లు వసూలు చేయాలని, అలా చేస్తేనే జీతాలు వస్తాయంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే గత నెల 5న జీతాలు ఇచ్చిన బల్దియా.. పండుగ మరుసటి రోజైనా వేతనాలు వస్తాయా? వచ్చే నెలలో ఎప్పుడు ఇస్తారో అన్న చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి..
Sadar festival | సదర్ ఉత్సవాలకు హర్యానా దున్నలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘గోల్ టూ’ దున్నపోతు
Real Estate | నత్తనడకన హైదరాబాద్ నిర్మాణ రంగం.. క్రయవిక్రయాల్లో మునుపెన్నడూ చూడని స్తబ్ధత