దేశీయ నిర్మాణ రంగాభివృద్ధిలో సుమారు దశాబ్దకాలంపాటు హైదరాబాద్‌ది ప్రత్యేక పాత్ర.
అయితే ఇప్పుడు సీన్ రివర్సైంది. దాదాపు ఏడాది కాలంలో అంతా తారుమారైపోయింది. అవును.. ఇండ్ల అమ్మకాల్లేక నగర రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కుదేలైంది మరి. ఏ నివేదిక చూసినా ఇప్పుడు కనిపిస్తున్నదిదే.
తాజాగా ప్రాప్‌టైగర్ విడుదల చేసిన రిపోర్టులోనూ అదే వెల్లడైంది. డిమాండ్ లేకపోవడంతో సగటు ఇండ్ల ధరల పెరుగుదలలో దేశీయ ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఆఖర్లో నిలబడాల్సి వచ్చింది.
Real Estate | న్యూఢిల్లీ, అక్టోబర్ 28: హైదరాబాద్ నిర్మాణ రంగం నత్తనడకన సాగుతున్నది. క్రయవిక్రయాల్లో మునుపెన్నడూ చూడని స్తబ్ధత నెలకొన్నది. అటు ఆఫీస్.. ఇటు హౌసింగ్ మార్కెట్ రెండూ వెలవెలబోతుండగా, ఈ పరిస్థితులపై వస్తున్న విశ్లేషణలు మరింత ఆందోళనకరంగా నిలుస్తున్నాయిప్పుడు. ఈ క్రమంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్.. హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో సగటున పెరిగిన ఇండ్ల ధరలపై తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది ఇదే వ్యవధిలో చదరపు అడుగు ధర సగటు పెరుగుదల సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కేవలం 7 శాతం పెరిగినట్టు ప్రాప్‌టైగర్ రిపోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ మినహా మిగతా ఏడు నగరాల్లో ధరల పెరుగుదల గడిచిన ఏడాది కాలంలో సగటున రెండంకెల స్థాయిలో ఎగబాకడం గమనార్హం. గరిష్ఠంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో 57 శాతం పెరుగుల కనిపించడం విశేషం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జోరు కనిపించింది. దాదాపు పదేండ్లపాటు ఈ ఉత్సాహం కొనసాగింది. అయితే గత ఏడాది చివర్లో రాష్ట్రంలో అధికారం మారడం, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇతరత్రా పరిస్థితులతో ఒక్కసారిగా నిర్మాణ రంగంలో మందగమనం ఆవరించిందని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నిపుణులు గట్టిగా చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు ఢిల్లీ-ఎన్సీఆర్లో కనిపిస్తున్న జోష్ కంటే గతంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకున్న క్రేజే ఎక్కువ. గత ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. దీంతో ఉద్యోగ-ఉపాధి అవకాశాలూ పెరిగాయి. ఇది నిర్మాణ రంగ పరిశ్రమ బలోపేతానికి దోహదం చేసింది. కానీ ఇప్పుడు మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు తగ్గిపోవడం, పెట్టుబడులు కూడా అంతంతమాత్రంగానే ఉండటం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు.. ఈ ప్రభావాలకుతోడు రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు సైతం రియల్ ఎస్టేట్ వృద్ధిని చిదిమేస్తున్నాయన్న అభిప్రాయాలు సంబంధిత వర్గాల నుంచి బలంగా వ్యక్తమవుతున్నాయి.
వినాయక చవితి మొదలు 5 నెలలపాటు ఏటా రియల్ ఎస్టేట్ మార్కెట్లో పండుగ కళ సంతరించుకుంటుంది. దాంతో నిర్మాణ రంగ అనుబంధ రంగాలూ కళకళలాడుతూంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళికి ఇండ్ల అమ్మకాలు భారీగానే నమోదవుతాయని, కానీ ఈసారి ఆ పరిస్థితులు కనిపించట్లేదని రియల్టర్లు అంటున్నారు. దీంతో ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ రియల్ మార్కెట్ లేవకపోవచ్చనే అనుమానాల్ని వెలిబుచ్చుతున్నారు. ఇదే జరిగితే పెట్టిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోతామని, ఇప్పటికే కట్టిన ఇండ్లు, ఫ్లాట్లు అలాగే ఉండిపోతున్నాయని, వాటిని అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ రియల్టీకి ఇంకొంత కాలం గడ్డుకాలమేనని చెప్పక తప్పని పరిస్థితి ఉందంటున్నారు.
కొనుగోలుదారుల్లో ముఖ్యంగా హైడ్రా భయాలు బాగా పెరిగిపోతున్నాయని, అందుకే అంతా వెనకడుగు వేస్తున్నారని నగరంలోని మెజారిటీ రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారిప్పుడు. ప్రధానంగా ఎగువ మధ్యతరగతి కస్టమర్లు ఇండ్ల కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో సొంతింటి కల అనేది సగటు మనిషికి జీవితకాల స్వప్నమని, ఇంటి కోసం ఉన్నదంతా అమ్ముకొనైనా, జీవితాంతం కష్టపడటానికైనా సిద్ధపడుతారని ఇండస్ట్రీ గుర్తుచేస్తున్నది. హైడ్రా ఎఫెక్ట్‌తో మార్కెట్‌పై అపనమ్మకాలు ఏర్పడ్డాయని, ఎక్కడ ఏది కొంటే.. ఎవరొచ్చి కూలగొడుతారేమోనన్న భయాందోళనల్లో ఇప్పుడు కొనుగోలుదారులు పడ్డారని రియల్టర్లు వాపోతున్నారు. అందుకే ఇండ్ల కొనుగోళ్లకే దూరం జరుగుతున్నట్టు వారంతా చెప్తున్నారు.