దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
వృద్ధ దంపతుల దుస్థితి చూసి చలించిపోయిన పోలీసులు
Hyderabad | మన్సూరాబాద్, అక్టోబర్ 28: కొడుకు చనిపోయిన విషయం తెలియని దివ్యాంగులైన తల్లిదండ్రులు మృతదేహంతోనే మూడు రోజుల పాటు గడిపారు. బయట ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారే కానీ పక్కనే కొడుకు నిర్జీవంగా పడి ఉన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. ఇంట్లో ఏదో దుర్వాసన వస్తున్నప్పటికీ ఏదో జీవి చనిపోయిందనుకున్నారే కానీ.. చనిపోయిన కుమారుడి మృతదేహం నుంచి వస్తున్న దుర్వాసనను తెలుసుకోలేని స్థితి వారిది. మూడు రోజుల నుంచి సదరు ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడం.. ఏదో దుర్వాసన వస్తుండటంతో కంగారు పడిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో దివ్యాంగుల కుమారుడు మృతి చెందిన విషయం బయటపడింది. ఈ సంఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, జైపురికాలనీ, బ్లైండ్స్కాలనీకి చెందిన రమణ (59), శాంతకుమారి (64)కి ఇద్దరు కుమారులు కె.ప్రదీప్‌కుమార్, కె.ప్రమోద్‌కుమార్ (32) ఉన్నారు. రమణ, శాంతకుమారి ఇద్దరికి కంటి చూపులేదు.. దివ్యాంగులు. రమణ ట్రైబల్ వెల్ఫేర్‌లో ఉద్యోగి.. కంటి చూపు లేక పోవడంతో వేరే వ్యక్తిని తన ఉద్యోగంలో సహాయకుడిగా పెట్టుకున్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్‌కుమార్ తన భార్యతో కలిసి వేరుగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు ప్రమోద్‌కుమార్ వృత్తిరీత్య పెయింటర్. ప్రమోద్‌కుమార్ తన భార్యతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉండేవాడు. ప్రమోద్‌కుమార్ మద్యానికి బానిసగా మారడంతో నాలుగు సంవత్సరాల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లి పోయింది. ప్రమోద్‌కుమార్‌కు తరచూ ఫిట్స్ వచ్చేవి. తండ్రికి వచ్చే జీతంతో జల్సాలు చేయడం, మద్యం తాగడాన్ని అలవర్చుకున్నాడు. రమణ, శాంతకుమారి ప్రమోద్‌కుమార్‌పై ఆధారపడి జీవించేవారు.
ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం మద్యం తాగి వచ్చిన ప్రమోద్‌కుమార్‌కు ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. కంటి చూపులేని దివ్యాంగులైన రమణ, శాంతకుమారి కుమారుడు తమ కండ్ల ఎదుటే చనిపోయి పడి ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. కుమారుడు వస్తాడు.. ఇంత భోజనం పెడతాడని ఎదురు చూడసాగారు. ఆకలితో అలమటిస్తున్న వారికి కుమారుడి మృతదేహం నుంచి వస్తున్న దుర్వాసనను గ్రహించి ఏదో జీవి చనిపోయిందేమో ఇంట్లో అనుకుంటున్నారే తప్ప.. తమ కుమారుడి మృతదేహం నుంచి వస్తున్న దుర్వాసన అని తెలుసుకోలేక పోయారు. మూడు రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడం.. ఇంట్లో నుంచి ఏదో దుర్వాసన వస్తుండటాన్ని గ్రహించిన స్థానికులు విషయాన్ని నాగోల్ పోలీసులకు తెలియజేశారు.
సోమవారం మధ్యహ్నం ఒంటి గంట సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తొలగించి లోనికి వెళ్లిన పోలీసులు ఇంట్లోని వాతావరణం చూసి కంగుతిన్నారు. ఒకవైపు కుళ్లి పోయిన స్థితిలో మృతదేహం పడి ఉండగా.. మరోవైపు ఇద్దరు దివ్యాంగులు ఏమి తెలియని స్థితిలో ఉండటాన్ని చూసిన పోలీసులు చలించిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నాగోల్ సీఐ సూర్యానాయక్, ఎస్సై శివనాగప్రసాద్లు దివ్యాంగులైన రమణ, శాంతకుమారిలను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి భోజన సదుపాయాన్ని కల్పించారు. కుటుంబ వివరాలను తెలుసుకున్న పోలీసులు విషయాన్ని పెద్ద కుమారుడైన ప్రదీప్‌కుమార్‌కు తెలియజేసి అక్కడికి రప్పించి రమణ, శాంతకుమారిని అతడికి అప్పగించారు. మూడు రోజుల నుంచి ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోయిన విషయాన్ని స్థానికులు గమనించకపోవడం శోచనీయం. ప్రదీప్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Sadar festival | సదర్ ఉత్సవాలకు హర్యానా దున్నలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘గోల్ టూ’ దున్నపోతు
Real Estate | నత్తనడకన హైదరాబాద్ నిర్మాణ రంగం.. క్రయవిక్రయాల్లో మునుపెన్నడూ చూడని స్తబ్ధత