సిటీబ్యూరో: మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పన కొలిక్కి వచ్చింది. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనాతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ సిస్ట్రాకు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను ఇవ్వడంతో ఆ సంస్థ ప్రతినిధులు బేగంపేటలోని మెట్రో రైలు భవన్ కేంద్రంగానే పనిచేస్తున్నారు.
డీపీఆర్‌కు తుది రూపం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చే నాటికి డీపీఆర్‌ను ప్రభుత్వం ముందుంచాలని హైదరాబాద్ మెట్రో అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో ప్రతిపాదించిన 5మెట్రో కారిడార్లకు వేర్వేరుగా డీపీఆర్‌లను సిద్ధం చేశారు. మొదటి దశలో పెండింగ్‌లో ఉన్న పాతబస్తీ మెట్రో మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తూ దానికి ప్రత్యేకంగా డీపీఆర్ సిద్ధం చేయగా, మిగతా 5 కారిడార్లకు డీపీఆర్‌లను ఆగస్టు 15 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
5 మెట్రో కారిడార్లకు వేర్వేరుగా డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలిచి వేర్వేరు నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఒకే సంస్థకు ఇవ్వకుండా 5 కారిడార్లను వేర్వేరు సంస్థలకు ఇవ్వడం ద్వారా ఒకే సమయంలో అన్ని కారిడార్ల పనులు ఆయా నిర్మాణ సంస్థలు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచే 50% నిధులు..
మొదటి దశ మెట్రోను పూర్తిగా పీపీపీ విధానంలో నిర్మిస్తే, రెండో దశను పూర్తిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే నిధులను సమకూర్చనున్నాయి. మొత్తం వ్యయంతో కేంద్ర ప్రభుత్వం 15శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం భరిస్తే, మిగతా 50 శాతంలో 45 శాతం రుణాల ద్వారా, మరో 5 శాతం వ్యయాన్ని పీపీపీ విధానంలో సమకూర్చుకునేలా రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
2029 నాటికి రెండో దశను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు డిజైన్‌తో పాటు నిధులను సమకూర్చుకునే ప్రణాళికను డీపీఆర్‌తో పాటు ప్రభుత్వానికి అందజేయనున్నారు. మొత్తం 5 కారిడార్లలో నిర్మించే మెట్రో రెండో దశకు కారిడార్ల వారీగా వ్యయాన్ని అంచనా వేస్తూ డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు లోపలి వరకు సుమారు 31 కి.మీ మెట్రోకు రూ.8500 కోట్ల దాకా వ్యయం అవుతుంది.
ఎయిర్‌పోర్టు కారిడార్ నిర్మాణంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు సంస్థ సైతం భాగస్వామిగా ఉండనున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఓఆర్ఆర్ వెంబడి ప్రతిపాదించిన మెట్రో మార్గంలో నిర్మాణానికి ఆ సంస్థ సుమారు రూ. 625 కోట్ల వరకు వెచ్చించేందుకు ముందుకు వచ్చింది. ఇలా ఒక్కో కారిడార్‌ను వేర్వేరుగా నిర్మించేందుకు వీలుగా డీపీఆర్‌లను రెడీ చేస్తున్నారు.
పాతనగరం మెట్రోకే రూ.2300 కోట్ల అంచనా..
పాతనగరంలో మెట్రో మార్గాన్ని నిర్మించే రోడ్డు విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. ఆ మార్గాన్ని 60 నుంచి 80 అడుగుల మేర విస్తరించాలంటే ఆస్తుల సేకరణ ఎక్కువ మొత్తంలో చేయాలి. ఈ మార్గంలో విద్యుత్ స్తంభాలు, మంచినీటి లైన్లు, డ్రైనేజీ లైన్స్, కేబుల్స్‌ను మరో చోటుకు తరలించాల్సి ఉంటుందని, సుమారు రూ.200 కోట్లు వ్యయం అవుతుందని మెట్రో అధికారి తెలిపారు.
మతపరమైన కట్టడాలు సైతం 100కు పైగా ఉండడంతో వీటికి ఎలాంటి ఆటంకం కలుగకుండా నిర్మాణాలు చేపట్టాలంటే.. చాలా సమయం తీసుకుంటుంది. 7.5 కి.మీ మెట్రో కారిడార్‌లో భారీ ఎత్తున ఆస్తులను సేకరించాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. ప్రతిపాదిత మెట్రో మార్గంలో సుమారు 1100లకు పైగా ఆస్తులు ఉన్నాయని, వాటన్నింటికీ పరిహారాన్ని చెల్లించాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సగం ఆస్తుల సేకరణకే వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ఈ లెక్కన పాతనగరం మెట్రోకే రూ.2300 కోట్ల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.