NASA | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారకుడి ఉపరితలంపై మిస్టీరియస్ రాయిని గుర్తించింది. ఈ రాయి మార్స్ సహజ, భౌగోళిక నిర్మాణంతో పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నది. శాస్త్రవేత్తలు 80 సెంటీమీటర్ల పొడవున్న ఈ రాయికి ‘ఫిప్సాక్స్లా’ అని నామకరణం చేశారు. ప్రస్తుతానికి ఈ రాయిని ఎలియన్ రాక్‌గా పేర్కొంటున్నారు. ఈ రాయిని సెప్టెంబర్ 19న గుర్తించారు. నాసా పెర్సెవరెన్స్ రోవర్ పంపిన ఈ రాయిని చూసి నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోవర్ జెజెరో క్రేటర్ సమీపంలోని వెర్నోడెన్ ప్రాంతంలోని రాళ్లపై అధ్యయనం జరుపుతున్నది. రోవర్ మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరా ఈ రాయిని గుర్తించి ఫొటో తీసింది. ఈ ఫొటోను నాసా బ్లాగ్ పోస్ట్‌లో షేర్ చేసింది. ఫిప్సాక్స్లా మరో సౌర వ్యవస్థకు చెందింది కావొచ్చునని తెలిపింది.
ఈ రాయి చిన్న డెస్క్‌ను పోలి ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మరో సిద్ధాంతం ఏంటంటో ఇది ఉల్కాపాతం ఫలితంగా కూడా వచ్చి ఉండవచ్చని పేర్కొంటున్నారు. క్యూరియాసిటీ రోవర్ 2014లో రెండు మీటర్ల వెడల్పు లెబనాన్ ఉల్కను, 2023లో కాకో ఉల్కను గుర్తించింది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు జెజెరో క్రేటర్‌లో ఇలాంటి లోహాలను గుర్తించాలని ఆశించారు. ఈ రాక్‌ను నాసా పరిశోధకుల బృందం గతవారంలో నిశితంగా పరిశీలించింది. రాయి ఆకారం, పరిమాణం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉందని పేర్కొంది. పెర్సెవరెన్స్ రోవర్ సూపర్‌క్యామ్ లేజర్, స్పెక్ట్రోమీటర్లతో చేసిన విశ్లేషణలో ఈ రాయిలో ఐరన్, నికెల్ మూలకాలు ఎక్కువ సాంద్రతతో ఉన్నట్లుగా గుర్తించారు. అంగారకుడి ఉపరితలంపై ఇలాంటి మూలకాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. గ్రహశకలాల కేంద్ర భాగాల్లో ఏర్పడే ఐరన్-నికెల్ ఉల్కలలో అధికంగా ఉంటాయి. ఈ క్రమంలో మరో సౌర వ్యవస్థ నుంచి మార్స్‌పైకి వచ్చి ఉండవచ్చని నాసా అంచనా వేస్తున్నది.