Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 73వ రోజు పూర్తిగా భావోద్వేగాలతో నిండిపోయింది. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొకరుగా హౌస్‌లోకి అడుగుపెట్టడంతో హౌస్‌లో ఆనందం, నవ్వులు, కన్నీళ్లు కలిసి ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ఎపిసోడ్లో డిమాన్ పవన్ తల్లి, సంజన భర్త-పిల్లలు, దివ్య తల్లి హౌస్‌లోకి వచ్చి తమ అభిమానులకు, ప్రేక్షకులకు మధుర క్షణాలను అందించారు.ముందుగా హౌస్‌లోకి వచ్చిన పవన్ తల్లి… తన కొడుకుని చూసిన వెంటనే కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పవన్ బాగా ఆడుతున్నాడని ప్రశంసించారు. రీతూని తోసిన ఘటనపై పవన్ అడగగా, “అలాంటిది ఏమీ అనిపించలేదు” అని తల్లి అన్నది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె హౌస్‌ను వీడింది.
సంజన కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రావాలంటే హౌస్ మేట్స్ వద్ద నుంచి సమయం రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇమ్మాన్యుయేల్ తన 45 నిమిషాల టైమ్‌లో 15 నిమిషాలను సంజన కోసం ఇచ్చి గొప్ప ఉదారతను చూపించాడు. కళ్యాణ్ కూడా 5 నిమిషాలు ఆఫర్ చేశాడు. ఇలా మొత్తం 16 నిమిషాల టైమ్ దక్కడంతో సంజన భర్త, పిల్లలు హౌస్‌లోకి అడుగుపెట్టారు. కొడుకు, కూతురిని చూసిన సంజన ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. పిల్లలతో కాసేపు ఆడుకుంటూ, భర్తతో ఏకాంతంగా మాట్లాడింది. సంజన చిన్న కొడుకు హౌస్ మేట్స్‌తో సరదాగా గడిపి అందరినీ ఆకట్టుకున్నాడు. “అమ్మ గెలిచి రా” అని చెప్పిన అతని మాటలు సంజనను మరింత ఎమోషనల్ చేశాయి.
రోజు చివర్లో దివ్య తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టగానే హౌస్ మొత్తం సందడిగా మారింది. తన కూతురిని చూసి “హౌస్‌లో ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నాన్న టీవీ ఆపేస్తున్నాడు” అంటూ సరదాగా చెప్పింది. పవన్–రీతూ మధ్య సాగుతున్న ట్రాక్‌పై కూడా ఫన్నీ సెటైర్లు వేసింది. హౌస్ మేట్స్ ఎవ్వరూ తమ క్యారెక్టర్ మార్చుకోవాల్సిన అవసరం లేదని, అందరూ అలా ఉన్నట్టే ఉండాలని సూచించింది. భరణి గురించి మాట్లాడుతూ, “భరణి గారిని చూస్తుంటే చనిపోయిన నా అన్నయ్య గుర్తుకు వస్తున్నాడు” అని చెప్పి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. దీనితో భరణి కూడా ఆమెను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. 73వ రోజు బిగ్ బాస్ హౌస్‌లో కుటుంబ సభ్యుల సందర్శన హౌస్ మేట్స్‌కు ఒక పెద్ద మానసిక శక్తినిచ్చింది. ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్లో కనిపించిన భావోద్వేగ క్షణాలను ఆస్వాదించారు.