కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 19 : కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌లో గ్రేవియార్డ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని రమ్యాగ్రౌండ్లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులు మందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, సబిహాబేగం కలిసి స్థానిక ప్రజా సమస్యలపై చర్చించి, వినతిపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అల్లాపూర్ డివిజన్లో ముస్లిం గ్రేవియార్డ్ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని కోరారు. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో హౌసింగ్ లేఆవూట్ ప్రకారం పాఠశాలకు కేటాయించిన స్థలం ఉందని, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని జీహెచ్ఎంసీకి అప్పగించాలని కోరారు. ఇప్పటికే ఆ స్థలంలో దాతల సహయంతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులను చేపట్టామని, పనులు మధ్యలోనే ఆగిపోయి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. వసంతనగర్ కాలనీ, సర్దార్‌పటేల్‌నగర్, ఎస్ఆర్ఏస్ఏ కాలనీలో భవన నిర్మాణ పనులకు అడ్డంకి లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వసంతనగర్ కాలనీ అధ్యక్షుడు ఏర్ర నాగేశ్వర్రావు, హనుమంతరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.