వెంగళరావునగర్, నవంబర్ 19 : ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని ఆ తల్లి ఐదో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కింది… అక్కడికి చేరాక పెద్దకొడుకుతో కలిసి తను ముందుగా లిఫ్ట్ గేటు తెరిచి అందులోంచి బయటకు వచ్చింది… మరో బిడ్డ బయటకు వస్తున్న క్రమంలో లిఫ్ట్ కిందకు కదిలింది. చిన్నారి తల అందులో ఇరుక్కుపోయింది. ఆ తల్లి కేకలు వేసేసరికి అపార్ట్మెంట్ వాసులు లిఫ్ట్ ఆపేసి..లిఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడ్ని బయటకు తీశారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆ బాలుడిని దవాఖానకు తరలించగా..అప్పటికే ప్రాణాలొదిలాడు.
మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ..ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తులో రామోజీ ఫిలింసిటీలో సెక్యూరిటీ అధికారిగా పనిచేసే నర్సారాయుడు, ఐశ్వర్య దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు హర్షవర్ధన్ (5) స్థానిక పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల విడిచాక ఇద్దరు కొడుకులను తీసుకుని తల్లి ఐశ్వర్య లిఫ్ట్‌లో ఐదో ఫ్లోర్‌కు చేరుకుంది. ముందుగా పెద్ద కొడుకును తీసుకుని ఐశ్వర్య లిఫ్ట్ నుంచి బయటకు రాగా.. చిన్న కుమారుడు బయటకు వచ్చే క్రమంలో లిఫ్ట్ కిందకు కదిలింది. బాబు తల అందులో ఇరుక్కుపో యింది.
ఆ తల్లి బిగ్గరగా కేకలు వేయడంతో అప్రమత్తమైన అపార్ట్‌మెంట్‌వాసులు లిఫ్ట్ ఆపేశారు. లిఫ్ట్‌లో ఇరుక్కున్న హర్షవర్ధన్ అపస్మారకస్థితికి చేరడంతో..చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కన్నతల్లి కళ్లెదుటే జరిగిన ఘోరం భయబ్రాంతులకు గురిచేసింది. లిఫ్ట్ ప్రమాదంలో బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.