నర్సింహులపేట, ఫిబ్రవరి 25 : ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు కుటుంబ పోషణ కోసం ఉపాధిహామీలో కూలి పనులకు వెళ్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. నర్సింహులపేట మండలంలోని జీపీ, ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ-పంచాయతీ ఆపరేటర్లుగా 45 మంది పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.19,500 చొప్పున వేతనాలు ఇవ్వాలి. గత అక్టోబర్ నుంచి వేతనాలు రావడం లేదు. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో అప్పులు చేయాల్సి వస్తున్నదని పలువురు ఆపరేటర్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో 10 రోజులు సెలవులు ఇస్తే కూలి పనులకు వెళ్లి కుటుంబ పోషణ చేసుకుంటామని పేర్కొంటూ ఎంపీడీవోలకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఉపాధి హామీ పనులు చేస్తూ విధులకు వెళ్లడం లేదు. జిల్లా అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.