వెంకటాపురం (నూగూరు), ఫిబ్రవరి 25: మారుమూల ప్రాంతంలో అస్వస్థతకు గురైన వలస కూలీని జోలెలో మూడు కిలో మీటర్లు తరలించి, అక్కడి నుంచి 108 వాహనంలో దవాఖానకు తీసుకెళ్లారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలోని గోదావరి లంకలో చోటుచేసుకున్నది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీ మంగు వెంకటాపురం (నూగూరు) మండలంలో కూలి పనులకు వచ్చాడు. మిర్చి తోటలో పనిచేస్తుండగా బుధవారం తీవ్ర అస్వస్థతకు గురై నడువలేని స్థితిలో ఉండటంతో గమనించిన తోటి కూలీలు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. కూలీ ఉన్న ప్రాంతానికి వాహనం వచ్చే ఆవకాశం లేకపోవడంతో తోటి కూలీలు జోలెకట్టి సుమారు మూడు కిలో మీటర్ల దూరం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి 108 వాహనంలో వెంకటాపురంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.