సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ అనుమతులు ఉండవు. కానీ లోగోను ముద్రిస్తారు. ప్రాజెక్టులో అభివృద్ధి పనులే జరగవు కానీ ప్లాట్లను అమ్మకానికి పెట్టేస్తారు. ఇప్పటికే కుప్పకూలిన రియల్ ఎస్టేట్‌తో అమ్మకాలు లేక వ్యాపారులు దివాళా తీస్తుంటే..మరోవైపు సందట్లో సడేమియా తరహాలో హెచ్ఎండీఏ ప్లాట్ల పేరిట కొందరు నయా వ్యాపారులు విక్రయించి కొనుగోలుదారులను నిండా ముంచుతున్నారు. కానీ అధికారులకేవి పట్టవు. నిబంధనలకు అతిక్రమించి జరుగుతున్న లావాదేవీలను గుర్తించరు. దీంతో తక్కువ ధర మాయలో పడి కొనుగోలుదారులు నిండి మునిగిపోతున్నా.. తమ సంస్థ పేరిట జరుగుతున్న అక్రమ లావాదేవీలను అరికట్టడంలో వెనుకడుగు వేస్తున్నారు.
అవుటర్ రింగు రోడ్డు దాటి హైదరాబాద్ నగరం విస్తరించింది. కొత్తగా పెరిగిన 10.5వేల కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చాయి. కానీ హెచ్ఎండీఏ పాలన తీరు మెరుగుపడలేదు. కనీసం కొనుగోలుదారులకు భరోసా ఇవ్వలేకపోతుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు.. వెంచర్లు, ప్రాజెక్టుల పేరిట అడ్డగోలు అక్రమాలకు దిగుతున్నాయి. అనుమతులు లేకుండా ఎకరాల కొద్ది ప్రాజెక్టులను కాగితాల్లో కట్టేస్తున్నాయి. నిబంధనలు పట్టించుకోకుండానే భవనాలను నిర్మిస్తున్నాయి. కానీ ఇవేవి అధికారులకు కనిపించవు, అటుగా కన్నెత్తి కూడ చూడటం లేదు. కానీ హెచ్ఎండీఏ కార్యాలయం పేరిట సాగుతున్న అక్రమాలపై పట్టించుకోలేని ఉన్నతాధికారులు.. అనుమతుల ప్రక్రియ సజావుగా సాగుతుందంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్పా…క్షేత్రస్థాయిలో సంస్థ పేరిట జరిగే అక్రమాలపై దృష్టి పెట్టడం లేదు.
లోగోతో మాయాజాలం..
హెచ్ఎండీఏ అధికారిక లోగోను వినియోగించుకుంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, కొనుగోలుదారులను గుడ్డిగా నమ్మిస్తున్నాయి. అనుమతులు ఉన్నాయంటూ వ్యాపారులు చెప్పే కల్లబొల్లి మాటలతో పెట్టిన పెట్టుబడితో నష్టపోతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే లే అవుట్ బ్రోచర్లో పెట్టే లోగోలు, అనుమతుల వివరాలను సరిచేసుకుని పెట్టుబడి చేస్తుంటారు. కానీ మెజార్టీ జనాలు వ్యాపారులు, ఏజెంట్లు చెప్పే మాటలతో ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. తీరా ఈ వెంచర్‌కు అనుమతులు లేవనీ, ఆ లోగోతో చేసిన మాయజాలంతోనే పెట్టుబడులు పెట్టామని తెలిసి లబోదిబోమంటూ వచ్చిన కాడికి తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఇటీవల పటాన్ చెరు సమీపంలో ఓ వెంచర్ నిర్వహకుడు ఇదే తీరుగా ఓపెన్ ప్లాట్లను విక్రయించగా, తీరా అనుమతులు లేవని తెలిసి, కొనుగోలుదారులు డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవ చేశారు. దీంతో వాయిదా పద్ధతుల్లో కట్టిన డబ్బులు చెల్లించేందుకు అంగీకరించారు. అదేవిధంగా చౌటుప్పల్ మార్గంలోనే ఇదే తీరుగా ఓ నిర్వహకుడు ఏకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ లే అవుట్‌ను విజయవాడ రహదారికి ఆనుకుని డెవలప్ చేశారు. నిజానికి ఆ ప్రాజెక్టును గ్రామ పంచాయతీ అనుమతులతో డెవలప్ చేసినట్లుగా తెలిసి కొనుగోలుదారులు గగ్గోలు పెట్టారు. కానీ బ్రోచర్లపై మాత్రం యథేచ్ఛగా హెచ్ఎండీఏ అనుమతులు, లోగోను వినియోగించినా అధికారుల కండ్లకు కనిపించలేదు.
అవగాహన కల్పించని హెచ్ఎండీఏ..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రామాణికతను కాపాడటంలో హెచ్ఎండీఏ చేతులెత్తివేసింది. అనుమతుల పేరిట జరుగుతున్న అక్రమాలను మరిచి, నిర్మాణాలు సాగుతున్న పట్టించుకునే స్థితిలో అధికారులు లేకుండా పోయారు. దీంతో రియల్ ఎస్టేట్ మాయగాళ్ల మాటలకు నమ్మి నిండా మునిగిపోతున్నారు. విస్తృతంగా సోషల్ మీడియా అందుబాటులో ఉన్నా… నిబంధనల విషయంలో స్పష్టత లేకపోవడంతో కొనుగోలుదారుల కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. కానీ అనుమతులు పేరిట జరుగుతున్న క్రయవిక్రయాలపై నియంత్రణ లేకపోవడంతో నష్టం తీవ్రత మరింత పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ ఓపెన్ ప్లాట్లకు అనుకూలమైన వ్యాపార కేంద్రాలు ఉన్న నేపథ్యంలో.. అవకతవకల నియంత్రణపై హెచ్ఎండీఏ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ అధికారుల ఆలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వినియోగదారులకు శాపంగా మారుతుంది.