మహబూబాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ/వాజేడు : వానకాలంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అంతంత మాత్రంగానే జరుగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కేంద్రాలు ప్రారంభించలేదు. అక్కడక్కడా కొనుగోళ్లు జరుగుతున్నా ధాన్యాన్ని మిల్లింగ్ చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. బ్యాంకు గ్యారెంటీకి మిల్లర్లు వెనుకడుగు వేస్తుండడంతో ధాన్యం సరఫరా ఎకడికకడ ఆగిపోయే ప్రమాదం ఉందని తెలుస్తున్నది. ఇక ములుగు జిల్లాలోని ఏజెన్సీలో ఎలాంటి అనుమతులు లేకుండా ధాన్యం బస్తాలతో పడికట్టు కడుతూ తూకంలో మోసం చేసి రైతులను నిలువునా ముంచుతుండడంతో వారి కష్టం దళారుల పాలవుతున్నది. మొత్తం మీద వడ్లను మద్దతు ధరతో అమ్ముకుందామంటే రైతులు అనేక ప్రయాసలు పడాల్సి వస్తున్నది.
ములుగు జిల్లాలోని ఏజెన్సీలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో దళారులు ఎటువంటి అనుమతులు లేకుండానే రైతుల పేరిట వే బిల్లులు తెప్పించుకొని తక్కువ ధరకు ధాన్యం కొని ఇతర జిల్లాలకు లారీల్లో తరలించి ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. పచ్చి ధాన్యం ఆరిపోతుందని రైతులను మభ్యపెడుతూ నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి తక్కువ ధరలకు కొనుగోలు చేసి దోచుకుంటున్నారు. వాజేడు పీఏసీఎస్ పరిధిలోని ఆరు కొనుగోలు కేంద్రాల్లో ఒక్క బస్తా ధాన్యం కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. అదే దళారులు కొనుగోలు చేస్తున్న చోట బస్తాలతో కళకళలాడుతున్నాయి. ముందస్తు పంటలకు పెట్టుబడి పేరుతో కొందరు ఎరువులు, పురుగు మందులు ఇచ్చి అధిక వడ్డీలు వేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
రైతులు ఏంచేసేది లేక నష్టమని తెలిసినా తాము పడించిన ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. కొన్ని పాత కాంటాలతో, మరికొన్నిచోట్ల ధాన్యం బస్తాలతో పడికట్టు కడుతూ తూకంలో మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై వాజేడు తహసీల్దార్ శ్రీరాముల శ్రీనివాస్‌ను వివరణ కోరగా అక్రమంగా అనుమతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు అందించలేదు. పలు మిల్లులో ధాన్యం మాయం కావడం వంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా జరిగినప్పుడు మిల్లర్ల నుంచి రికవరీ కష్టంగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పౌరసరఫరాల సంస్థ అధికారులు బకాయి లేని మిల్లర్లకు కేటాయించే ధాన్యంలో 10 శాతం, ఇప్పటికే బకాయి ఉన్న వారికి 20 శాతం బ్యాంకు గ్యారెంటీలను అందించాలని నిర్ణయించారు. జిల్లాలో 62 మిల్లులకు 22 మాత్రమే బ్యాంకు గ్యారెంటీ ఇవ్వగా, మిగతా 40 మంది మిల్లర్లు గ్యారెంటీ ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విపరీతంగా వస్తున్న తరుణంలో దాన్ని ఎకడ నిల్వ చేయాలనేది అధికారులకు ప్రశ్నగా మారింది.
మిల్లర్లు కావాలనే గ్యారెంటీలు ఇవ్వడం లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన మిల్లులకు కేటాయింపులు పూర్తయిన తర్వాత అండర్ టేకింగ్‌ను బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకొని అధికారులు ధాన్యం ఇస్తారని కొంతమంది భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు చొరవ చూపడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వకపోతే మరో వారం రోజుల్లో ధాన్యం సరఫరా ఎకడికకడ ఆగిపోయే ప్రమాదం ఉందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రైతుల వద్ద కొన్న వడ్ల బస్తాలను ఎకడ నిల్వ చేస్తారో.. ప్రైవేటు గోదాములు అద్దెకు తీసుకొని పంపిస్తారా.. లేకపోతే ఇతర జిల్లాల్లో ఉన్న మిల్లులకు తరలిస్తారా అనేది వేచి చూడాలి.
హనుమకొండ జిల్లాలో మొత్తం 161 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ నెల 19వ తేదీ వరకు 87 సెంటర్లలో మాత్రమే అధికారులు కొనుగోళ్లు ప్రారంభించారు. కొన్ని సెంటర్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఎదురు చూస్తుండగా మరికొన్ని చోట్ల సెంటర్లను ప్రారంభించకపోవడంతో నిరీక్షిస్తున్నారు. వానకాలంలో 1,70,591 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు కేవలం 1449.040 మెట్రిక్ టన్నులు కొన్నారు. అయితే కొను గోలు చేసిన ధాన్యాన్ని మిల్లులను ట్యాగింగ్ చేసే ప్రక్రియ సైతం ఆలస్యంగా జరుగుతున్నది. ఇందులో గతంలో సీఎంఆర్ పెండింగ్ ఉన్న, అధికారులకు అనుకూలంగా ఉన్న రైస్ మిల్లులనే ట్యాగింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.