మేడ్చల్, నవంబర్21(నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ఏసీబీ అధికారుల దాడుల్లో డాక్యుమెంట్ రైటర్ల వద్ద దొరికిన దస్తావేజులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ రైటర్ల వద్ద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దొరికిన దస్తావేజులపై జరిగిన లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
దస్తావేజులకు సంబంధించిన యజమానుల నుంచి జరిగిన లావాదేవీలపై వివరాలు సేకరించే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడుల అనంతరం డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న దస్తావేజులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
స్వాధీనం చేసుకున్న దస్తావేజుల ఆధారంగా వాటిపై జరిగిన విచారణను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. రిజిస్ట్రేష న్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్ రైటర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా చేస్తున్న ఏసీబీ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు చేస్తున్న విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చిన ట్లు సమాచారం. డాక్యుమెంట్ రైటర్లు జిల్లాలోని వివిధ సబ్ రిజిస్ట్రార్లను ఎలా మేనేజ్ చేస్తున్నారన్న విషయాలపై లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
డాక్యుమెంట్ రైటర్లు ఎంతచెపితే అంతే..!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా సబ్ రిజిస్ట్రార్లు.. డాక్యుమెంట్ రైటర్లు ఎలా చెపితే అలానే నడుచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఉదాహరణ కీసర మండలం, నాగారం మున్సిపాలిటీ పరిధిలో నకిలీ డాక్యుమెంట్లపై రిజిస్ట్రేషన్లు జరిగిన విషయం విదితమే. ఇలానే జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న తీరును జిల్లా రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు చూసిచూడనట్లు వ్యవహారిస్తుం డడంపై అనేక అనుమానాలకు తావిస్తుంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు దస్తావేజులు వ్యాల్యు మేరకు రేటును ఫిక్స్ చేసిన విషయం బహిరంగ రహస్యమే.
వారం రోజులుగా కొనసాగుతున్న విచారణ..
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన తనిఖీలపై వారంరోజులుగా విచారణ కొనసాగు తున్నది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బహిరంగంగా అవినీతి జరుగుతున్నా విచారణ పేరిట జాప్యం ఎందుకు జరుగుతుందన్న ప్రశ్నలు ప్రజలకు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి చెక్పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అనేక మందికి న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతు న్నాయి. విచారణను వేగంగా చేసి అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది.