విఖ్యాతనటుడు కమల్‌హాసన్ కలల ప్రాజెక్ట్ అనగానే.. ఠకీమని గుర్తొచ్చే పేరు ‘మరుదనాయగం’. శతాబ్దాల కిందటి ఈ ద్రవిడ మహాయోధుడి కథను తెరకెక్కించాలనేది కమల్‌హాసన్ దశాబ్దాలనాటి కల. 1996లోనే దీనికి ఆయన అంకురార్పణ చేశారు. సినిమాకు పదికోట్లు అంటే భారీ బడ్జెట్‌గా చెప్పుకునే ఆ రోజుల్లోనే 50కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించేందుకు కమల్ నిర్ణయించారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఈ సినిమాపై వర్క్ చేశారు. టెస్ట్ షూట్ చేశారు. కొన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ కూడా చేశారు. యాక్షన్ సీన్స్‌కి భారీగా డబ్బులు ఖర్చుపెట్టారు. అప్పటికే 5కోట్ల వరకూ ఈ సినిమాకోసం వెచ్చించారు. ఇది అప్పట్లో చాలా పెద్ద మొత్తం. ఆ క్రమంలో అనుకోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సినిమా అటకెక్కింది.
అయితే ‘మరుదనాయగం’ని కమల్ మర్చిపోలేదు. నేటికీ అప్పుడప్పుడు ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూనే ఉంటారాయన. ఇదిలావుంటే.. ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై కదలిక మొదలైంది. అప్పట్లో 50కోట్లు అనుకున్న ఈ సినిమా.. అలాగే ఇప్పుడు తీస్తే 500కోట్లు పైమాటే అని అంచనా. అయితే.. తాజాగా వచ్చిన ఏఐ టెక్నాలజీ ఈ సినిమాకు వరం కానున్నదని టాక్. ఏఐ సహాయంతో కేవలం 25శాతం బడ్జెట్‌తోనే ‘మరుధనాయగం’ని పూర్తి చేయొచ్చని కొన్ని వీఎఫ్ఎక్స్ కంపెనీలు కమల్ని సంప్రదించాయట. కమల్ కూడా ఈ విషయంపై ఉత్సాహంగా ఉన్నట్టు సమాచారం. అదే గనుక జరిగితే.. భారతీయ సినిమాకే కమల్ మార్గదర్శకుడవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.