KTR | హైదరాబాద్ : హైదరాబాద్ బస్తీల్లో ఉండే పేద ప్రజలకు అండగా ఉంటాం.. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మరి ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రజలకు 50 ఏండ్ల కిందట ప్రభుత్వమే పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చింది. వారి చేత నల్లా బిల్లు, కరెంట్ బిల్లు కట్టించుకుంది. ఇవాళ్నేమో నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతామని దుందుడుకుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ సుందీరకరణ, హైడ్రా ఏదైనా కావొచ్చు.. ఏదైనా సరే.. నిర్దిష్టమైన ఆలోచన, పద్ధతి, ప్రణాళిక లేదు. హైడ్రాను బిల్డర్లను, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి వసూళ్లు చేయడానికి వాడుతున్నారని తెలుస్తోంది. ఇది మా పార్టీ స్థిరమైన నిర్ణయం కూడా అని కేటీఆర్ పేర్కొన్నారు.
మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉంది దాన్ని వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. హైదరాబాద్ నగరంలో వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తయ్యాయి. కొన్ని చివరి దశలో ఉన్నాయి. మొన్న ఉప్పల్ నియోజకర్గంలో సీవరేజ్ ప్లాంట్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కూకట్పల్లి, ఫతేనగర్‌లో ఎస్టీపీలు పూర్తయ్యాయి. అంబర్‌పేటలో పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. వీటి ద్వారా శుద్ధమైన నీరు దిగువకు పోతోంది. గత ప్రభుత్వాలు చేయలేని పనిని కేసీఆర్ చేశారు. ఇది వాస్తవం.. కొత్తగా ఎస్టీపీల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్‌లోకి నీళ్లు తేవడానికి దాన్ని మూసీకి అనుసంధానం చేయడానికి 1100 కోట్లకు గతంలో కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్టీపీలు పూర్తి చేసి, మూసీ ద్వారా గోదావరి జలాలను తరలిస్తే.. ఈ రెండు పనులు చేస్తే.. ఆటోమేటిక్‌గా శుద్ధ జలాలు నల్లగొండ జిల్లాకు పోతాయి. మీరు కొత్తగా లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నల్లగొండకు శుద్ధమైన జలాలు ఇస్తున్నాం అని సీఎం సన్నాయి నొక్కులు నొక్కుతూ.. పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మూసీ సుందరీకరణ విషయంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. 100 శాతం ఎస్టీపీలు చేస్తున్నాం. నాగోల్‌లో అతి తక్కువ ఖర్చుతో సుందరీకరణ చేశాం. మిగతా పనులకు ఆమోదం తెలపండి అని కేసీఆర్ దగ్గరకి వెళ్లాం. కేసీఆర్ అర గంట చర్చించిన తర్వాత.. ఎక్కువ మంది పేదలకు నష్టం జరిగేలా ఉంది. పేదలకు నష్టం కాకుండా.. వాళ్ల పొట్ట మీద కొట్టకుండా.. ఊరు అవతలకు పంపకుండా.. తిరిగి ప్రతిపాదన సిద్ధం చేయాలని చెప్పారు. మానవీయ కోణంలో కేసీఆర్ ఆలోచించారు. నాగోల్‌లో నాలుగైదు కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ ఎయిర్ జిమ్స్, పార్కులు, ఉప్పల్ భగయాత్‌లో పక్కన సుందరీకరణ చేశాం. పేదవాళ్ల కడుపు కొట్టలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR | ఆ 80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన కేటీఆర్
Hyderabad | కిలోమీటర్ దాకా కూలగొడ్తరా.. మూసీ ఎఫ్టీఎల్, బఫర్ దాటి భూసేకరణకు సర్కార్ స్కెచ్
Hydraa | హైడ్రా ఇష్టమొచ్చినట్లు కూల్చుడు కుదరదు.. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు