Iranian oil : భారత్‌కు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్. ఇరాన్ నుంచి చమురు కొనేందుకు ఉన్న ఆంక్షల్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో ఇకపై ఇండియా.. ఇరాన్ నుంచి కూడా చమురు కొనుగోలు చేసే వీలుంది. ఇదే జరిగితే, భారత్‌కు మరింత చమురు సరఫరా పెరుగుతుంది. ఈ నేపథ్యలో ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత రిఫైనరీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. చమురు దిగుమతులపై ఆధారపడ్డ అనేక దేశాలు తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అలాగే, గల్ఫ్‌లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేసి ధ్వంసం చేస్తోంది. దీంతో చమురు సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యారెల్ క్రూడాయిల్ దర 119 డాలర్ల వరకు చేరుకుంది. ఇంకా ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ చమురు కొనుగోలుపై ఉన్న ఆంక్షల్ని అమెరికా ఎత్తివేసింది. ఇరాన్ చమురు కొనుగోలు చేయకూడదని అమెరికా చాలా కాలంగా ప్రపంచ దేశాల్ని కోరుతోంది. ఇరాన్ చమురు కొన్న దేశాలపై అమెరికా అదనపు సుంకాలు విధించడం సహా పలు ఆంక్షలు విధిస్తోంది. దీంతో అమెరికా ప్రభావంతో అనేక దేశాలు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం లేదు. చైనా వంటి కొన్ని దేశాలు మాత్రమే అమెరికాను ధిక్కరించి ఆయిల్ కొంటున్నాయి.
అయితే, ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో నెల రోజులపాటు ఇరాన్ చమురు కొనుగోలుపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఏప్రిల్ 19 వరకు ప్రపంచ దేశాలు ఇరాన్ చమురు కొనుగోలు చేయవచ్చని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. అయితే, ఇది ఇప్పటికే ఇరాన్ నుంచి రవాణా ప్రారంభమై, మార్గ మధ్యలో నిలిచిపోయిన చమురు విషయంలోనే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకానీ, కొత్తగా ప్రారంభించే చమురు సరఫరాకు ఈ మినహాయింపు వర్తించదన్నారు. యుద్ధం కారణంగా ఇరాన్ చమురు నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. వాటి నుంచి మాత్రమే చమురు కొనాలని అమెరికా చెబుతోంది. దీని ద్వారా అదనంగా 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు అందుబాటులోకి వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.
ఆంక్షల్ని సడలించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురును తీసుకునేందుకు ఇండియన్ రిఫైనరీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు తమ దేశపు చమురు ఇప్పుడు సముద్ర జలాలపై నిలిచి లేదని ఇరాన్ అంటోంది. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇక, ఇండియన్ రిఫైనరీలు చమురు దిగుమతి చేసుకోవాలంటే మన ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉంది. అలాగే, చెల్లింపులు ఏ కరెన్సీలో జరపాలి అనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది.