Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : అదో జీవనది. దానికి ఇరువైపులా ఎక్స్‌ప్రెస్‌వేలు, వాక్‌వేలు, సైకిల్ ట్రాక్‌లు, పార్కులు, ప్లాజాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, గ్లోబల్ ఆర్కిటెక్చరల్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన అంతర్జాతీయ స్థా యి ఐకానిక్ నిర్మాణాలు… వీటన్నింటినీ చూసేందుకు రెండు కండ్లూ చాలవు! ఇవన్నీ చదువుతుంటే ‘అమరావతి’ తర హా గ్రాఫిక్స్ గుర్తొస్తున్నాయా? కానీ ఇవి అమరావతి నిర్మాణాలు కాదు. లక్షన్నర కోట్ల మూసీ సుందరీకరణ అంటే ఇదేనంటూ కాంగ్రెస్ పార్టీ-ప్రభుత్వ పెద్దలు అరచేతిలో చూపుతున్న అపురూప దృశ్యాలు. ఇంతవరకు బాగానే ఉందిగానీ ఇన్ని నిర్మాణాలు చేపట్టాలంటే చాలా విస్తీర్ణం కావాలి కదా అనేగా మీ అనుమానం! అందులో సందేహం ఏమీ వద్దు. మూసీ నదీ మార్గానికి రెండువైపులా కిలోమీటరు వెడల్పులో ఈ సుందరీకరణ ప్రాజెక్టును నిర్మించాలని రేవంత్‌రెడ్డి సర్కారు నిర్ణయించింది. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో ప్రజా సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు, సదరు ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లోనూ మూసీ నదికి రెండువైపులా కిలోమీటరు చొప్పున 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రణాళికలో భూసేకరణ, పునరావాసం అనే ప్రక్రియలు కూడా ఉన్నాయని అందు లో పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ మాస్టర్‌ప్లాన్ బాధ్యతల్ని మెయిన్‌హార్ట్ కన్సార్షియంకు అప్పగించిన ఈ నెల 4వ తేదీనే కాంగ్రెస్ పార్టీ-ప్రభుత్వ పెద్దలు కొందరు ప్రజా సంఘాలతో సమావేశమయ్యారు. అందులో ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఉన్న కీలకమైన అంశాల్లో ఇది కూడా ఒకటి. ఇవేకాదు… మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మసిబూసి ‘మూసీ’ సుందరీకరణ ప్రాజెక్టును కండ్ల ముందు చూపారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అనగానే స్వచ్ఛమైన నీటిని ప్రవహింపజేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు కూడా సెలవిచ్చారు. మరి సుందరీకరణలో ఏమేం చేయబోతున్నారనే వివరాలను ఇప్పటివరకు అటు ప్రభుత్వం గానీ, ఇటు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అధికారులుగానీ ప్రజలకు వివరించలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం తదితర ప్రముఖులు ఈ నెల 4న పలు ప్రజా సంఘాలకు చెందిన ప్రముఖులు డాక్టర్ హరగోపాల్ (రిటైర్డ్ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త), డాక్టర్ వర్గీస్ (ఛత్రి సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్), సంధ్య (పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్), సజయ (ట్రాన్స్‌జెండర్స్ సంస్థల జేఏసీ సభ్యురాలు), మీరా (ఎన్ఏపీఎం జాతీయ కన్వీనర్), శ్రీహర్ష (సఫర్ రాష్ట్ర కోఆర్డినేటర్), డాక్టర్ లిస్సీ జోసెఫ్ (తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్), డాక్టర్ ఫిలిప్స్ (దివ్య దిశ డైరెక్టర్), బ్రదర్ రాజదేశాయ్ (విద్యావేత్త), సమీరాబేగం (ఉపాధ్యాయురాలు), ఏ హైమ (ఛత్రి) ఉన్నారు. వీరికి 38 పేజీలతో కూడిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో మూసీ సుందరీకరణకు సంబంధించి ఏమేం చేయబోతున్నామనే వివరాలను పొందుపరిచారు. ఇందులోనే పలుచోట్ల పొందుపరిచిన అంశాలు పలు అనుమానాలకు దారి తీస్తుండగా, మరికొన్ని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంపై ప్రభుత్వం ఎంత గోప్యత పాటిస్తున్నది? ఎలా తప్పుడు సమాచారం వెల్లడిస్తున్నది? అనేది వెల్లడిస్తున్నాయి.
మూసీ సుందరీకరణ నదికి రెండువైపులా అసలు ఎంత విస్తీర్ణంలో చేపడుతున్నారనే దానిపై స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రాలేదు. పలు ప్రసంగాల్లో సీఎం రేవంత్‌రెడ్డి 12 వేల వరకు నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించారు. కానీ ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో రివర్ బెడ్‌తో పాటు బఫర్‌జోన్‌లో 10,017 నిర్మాణాలు (రివర్ బెడ్లో 2,166, బఫర్‌జోన్‌లో 7851), 200 ఖాళీ స్థలాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అంటే వీటికి అనుమతులు తీ సుకున్నా అక్రమ నిర్మాణాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
మూసీ సుందరీకరణ అంచనా వ్యయాన్ని ఈవోఐ టెండర్ నోటిఫికేషన్ డాక్యుమెంట్లో రూ. 58 వేల కోట్లుగా పొందుపరిచారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం ‘ఎవరు చెప్పారు?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజాసంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో అక్షరాలా లక్షన్నర కోట్ల మూసీ అనేది మరోసారి బహిర్గతమైంది. ఈ ప్రాజెక్టుకు పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి 500 మిలియన్ డాలర్లు, ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) నుంచి 500 మిలియన్ డాలర్లు, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) నుంచి 500 మిలియన్ డాలర్లు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు చర్చలు కొనసాగుతున్నట్టు ప్రజెంటేషన్‌లో పొందుపరిచారు.
ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో వాస్తవాల్ని దాచడంతో పాటు తప్పుడు సమాచారాన్ని కూడా పొందుపరిచారు. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన టెండర్లకు సంబంధించి ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) టెండర్లలో అర్హత సాధించిన ఏడు బిడ్లను షార్ట్ లిస్ట్ చేయగా రెండు కన్సల్టెన్సీ కంపెనీలు మిగిలినట్టు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి మొదటిసారి టెండర్లలో మాత్రమే ఏడు కంపెనీలు సాంకేతిక అర్హత సాధించాయి. అందులో ఐదు కంపెనీలు ఆర్ఎఫ్పీలను సమర్పించాయి. ప్రైస్ బిడ్లను తెరిచిన తర్వాత ప్రభుత్వ పెద్దల జోక్యంతో, మెయిన్‌హార్ట్‌కు మాత్రమే టెండర్ దక్కాలనే యోచనతో ఆ టెండర్లను రద్దు చేసిన అంశాన్ని ప్రజా సంఘాలకు వెల్లడించలేదు. ఈ నెల 4న ఇచ్చిన ప్రజెంటేషన్‌లో రెండు కంపెనీల ఆర్ఎఫ్పీ బిడ్లను పరిశీలించి, ఒక కంపెనీని ఎంపిక చేస్తామని తెలిపారు. అందులో లీ అసోసియేట్స్ కన్సార్టియంతో పాటు సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కన్సార్షియం పేర్లు ఉన్నాయి. కానీ ప్రజా సంఘాలకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చిన సమయానికి మెయిన్‌హార్ట్ కన్సార్షియంకు మాస్టర్‌ప్లాన్ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు (4వ తేదీన) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, గత నెల 25వ తేదీన ఎంఆర్డీసీఎల్ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాస్తూ మెయిన్‌హార్ట్ కన్సార్షియం ఎంపికకు ఆమోదం తెలపాలని ప్రతిపాదించారు. అయినా, ఈ విషయాన్ని ప్రజెంటేషన్‌లో ఎందుకు దాచి పెట్టారనేది ప్రభుత్వ పెద్దలకే తెలియాలి? ఎంఆర్డీసీఎల్ అధికారులు లీ అసోసియేట్స్ కన్సార్షియంను సాంకేతిక కారణాలతో తిరస్కరిస్తే ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఎందుకు దాచి పెట్టి మసిపూసి ప్రజెంటేషన్‌ను ప్రజా సంఘాల ముందు ఉంచారు. కన్సల్టెన్సీ కాల పరిమితి (ఎగ్జిక్యూషన్ సపోర్ట్)ని ప్రజెంటేషన్‌లో టి+48 నెలలుగా పేర్కొన్నారు. అంటే టెండర్ల పూర్తి నుంచి నాలుగు సంవత్సరాల పాటుగా చెప్పారు. కానీ మెయిన్‌హార్ట్‌కు ఇచ్చిన అంగీకార పత్రంలో 66 నెలలుగా పొడగించడం వెనక మతలబు ఏమిటన్నది రహస్యం.
నదికి రెండువైపులా కిలోమీటరు వరకు ఉండే విస్తీర్ణాన్ని కూడా సేకరించనున్నట్టు ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా స్పష్టమవుతుంది. అందుకే రివర్ బెడ్, బఫర్‌జోన్ వరకు ప్రత్యామ్నాయాలు చూపి, అక్కడి నుంచి కిలోమీటరు విస్తీర్ణం వరకు ఉండే నిర్మాణాలను భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రజెంటేషన్‌లో సుందరీకరణలో భాగంగా చేపట్టే అభివృద్ధి గ్రాఫిక్స్‌ను వివరిస్తూ ఇందులో భూసేకరణ, పునరావాసం ఉంటుందని పొందుపరిచారు. భూసేకరణ చట్టం-2013 ద్వారా ఈ ప్రక్రియ ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమి విలువను ప్రామాణికంగా తీసుకుంటారు.
ప్రజా సంఘాలకు ఇచ్చే ప్రజెంటేషన్‌ను రూపొందించడంలో ఎంఆర్డీసీఎల్ అధికారులు హడావుడి ప్రదర్శించినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా ఇప్పటివరకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనే వివరాలతో గతంలోనే రూపొందించిన వివరాలు (ైస్లెడ్స్) వాడుకున్నారు. ఆపై తాజాగా ఏం జరుగుతుందనే వివరాలు కలిపారు. ఈ నేపథ్యంలో గత వివరాల్లో భాగంగా మాస్టర్‌ప్లాన్ టెండర్లకు సంబంధించిన వివరాల్లో ‘మాస్టర్ ప్లాన్ రూపొందించే కన్సల్టెన్సీ ఎంపిక టెండర్లలో బిడ్లను స్వీకరిం చాం. సాంకేతిక పరిశీలన పురోగతిలో ఉంది. 10, జూలై 2024 వరకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది’ అని పేర్కొన్నారు. అక్టోబర్ 4వ తేదీన ఇచ్చిన ప్రజెంటేషన్‌లో మూడు నెలల కిందటనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందనే వాక్యాలు ఉన్నాయి. అధికారులు హడావుడిలో పాత ప్రజంటేషన్‌లోని కీలక నిర్ణయాన్ని ఇం దులో కొనసాగించారు. అంటే ‘నమస్తే తెలంగాణ’లో టెండర్ల బాగోతంపై ఇటీవల వచ్చిన కథనం అక్షర సత్యమనేందుకు ఈ ప్రజెంటేషన్ నిదర్శనం. వాస్తవానికి అధికారులు 10, జూలై వరకు టెండర్లను పూర్తి చేద్దామని అనుకున్నా రు. కానీ రేవంత్‌రెడ్డి-చంద్రబాబు భేటీ తర్వా త పరిణామాలు మారడంతో ప్రభుత్వ పెద్దల జోక్యంతో మొదటి టెండర్లు రద్దు చేశారు.