Actress Ramya on Dhurandhar | బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నప్పటికీ మరోవైపు విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అధికార పార్టీ బీజేపీ ప్రచార చిత్రమని ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు నటులు ప్రకాశ్ రాజ్, మలయాళ దర్శకుడు దేవదత్ షాజీ తదితరులు ఈ సినిమా ఉద్దేశిస్తూ పరోక్షంగా కామెంట్లు చేశారు. అయితే తాజాగా కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య కూడా స్పందిస్తూ.. ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు.
రమ్య ఎక్స్ వేదికగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇప్పుడే ‘ధురంధర్ 2’ చూశాను.. బాబోయ్.. ఎంతో కంటెంట్ ఉన్న ఒక కథను ప్రేక్షకుల సహనానికి పరీక్షగా ఎలా మార్చాలో ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు. ఈ సినిమా చూస్తుంటే అసలు ముగింపు లేని ఒక బోరింగ్ సబ్జెక్ట్ చదువుతున్నట్లు ఉంది. ఒకానొక దశలో మన మెదడు పనిచేయడం ఆగిపోయి, స్క్రీన్ మీద జరుగుతున్న ఘోరాన్ని చూసి విరక్తితో నవ్వొస్తుంది. మీకు నిజంగా ఈ సినిమా చూడాలని ఉంటే, దయచేసి థియేటర్‌కు వెళ్లి మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోవద్దు. ఇది కేవలం ఓటీటీలో చూస్తూ, మధ్యలో ఫోన్ స్క్రోల్ చేస్తూ, అసలు నా జీవితం ఎటు వెళ్తోంది? అని ప్రశ్నించుకోవడానికి పనికొచ్చే సినిమా మాత్రమే.
దర్శకత్వం, డైలాగులు, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్టింగ్.. ఇలా అన్నీ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి. మార్చి 19న రిలీజ్ డేట్ ఉందని వీరికి ఎవరూ చెప్పలేదా? లేక అంతా చెత్తగా ఉందని తెలిసినా “పర్లేదులే.. పంపించేయండి” అని రిలీజ్ చేసేశారా? అనిపిస్తుంది. ‘ధురంధర్’ మొదటి భాగం చూస్తున్నప్పుడు థియేటర్లో ఈలలు, చప్పట్లు, ఒక రకమైన ఎనర్జీ ఉండేవి. కానీ సెకండ్ పార్ట్‌లో ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ అవ్వలేదు. థియేటర్ అంతా ఒక రకమైన నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక రణవీర్ సింగ్ ఈ సినిమాను తన భుజాలపై మోశారు అని అంటున్న వారికి నాదొక ప్రశ్న.. ఆయన అసలు ఏం మోశాడు? నాకు అక్కడ కేవలం ఆయన జుట్టు మాత్రమే కనిపించింది. మొదటి భాగంలో ఆ జుట్టుకు ఒక పర్సనాలిటీ, ఒక క్యారెక్టర్ ఉండేది. కానీ ఇందులో అది ప్రతి సీన్‌ను అడ్డుకుంటూ పిచ్చిగా ఉంది. బహుశా ఆ జుట్టుకు ‘బెస్ట్ సపోర్టింగ్ రోల్’ నామినేషన్ ఇవ్వాలేమో.
సినిమాలో హింస గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇది సినిమా లాగా లేదు.. దొరికిన ప్రతి వస్తువుతో ఎంత వింతగా హింసించవచ్చో చూపించే ఒక విజువల్ హ్యాండ్‌బుక్ లాగా ఉంది. సిరంజిలు, స్పానర్లు, కత్తులు, గొలుసులు, బాంబులు.. ఇలా దేనినీ వదలకుండా ఆయుధాలుగా మార్చేశారు. ఒక సీన్ కంటే మరో సీన్ ఎంత హింసాత్మకంగా ఉండాలని దర్శకుడు తనతో తనే పోటీ పడినట్లు ఉన్నాడు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే.. రెండు కాళ్లు నరికేసి, కిరోసిన్ పోసినా కూడా సదరు పాత్ర ఏదో ‘టెడ్ టాక్’ ఇస్తున్నట్లు డైలాగులు చెబుతూనే ఉంటుంది. మెడికల్ సైన్స్ వర్ధిల్లాలి. దీనికి ఆస్కార్ కాదు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ‘ధురంధర్ 2’ భారీగా నిరాశ కలిగించిన చిత్రం. ఇదొక నిద్రపుచ్చే సినిమా. పార్ట్ 1 చూసి మీరు ఫిదా అయ్యి ఉంటే, 2వ పార్ట్ చూశాక అసలు ఆ పార్ట్ ఎందుకు నచ్చింది? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. రణవీర్.. నువ్వు ఇంతకంటే గొప్ప నటుడివి. ఆదిత్య ధర్.. ఈ పాతబడిన జాతీయవాదం, ప్రొపగాండాల నుంచి ఇకనైనా బయటపడండి అంటూ రమ్య రాసుకోచ్చింది.
Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.
It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026