KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా, మూసీ సుందరీకరణపై దాదాపు రెండు గంటలకు పైగా చర్చించామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఈ ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల, అనాలోచిత విధానాల వల్ల బస్తీల్లో ఉండే పేద ప్రజలు ఏయే ఇబ్బందులకు గురవుతున్నారో వివరంగా చర్చించాం. అనాలోచిత విధానాలు, నిర్ణయాలు వల్ల నగరంలోని పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అనాలోచితం ఎందుకు అంటున్నామంటే ఈ ప్రభుత్వం ఒక ప్రణాళిక, అవగాహన, ఆలోచనే లేకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు దూకుడుగా ఇష్టారీతిన ముందుకు పోతున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మోదీ పెద్ద నోట్ల రద్దు విషయంలో రోజుకో కారణం చెప్పినట్లు రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణపై రోజుకో మాట చెబుతున్నారు. నోట్ల రద్దు విషయంపై మోదీ మాట్లాడుతూ.. తీవ్రవాదాన్ని అరికట్టేందుకు, నల్లధనం రూపుమాపేందుకు, డిజిటలైజేషన్ వైపు తీసుకుపోతున్నామని, నక్సలిజాన్ని అరికట్టడానికి అని రోజుకో కారణం చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ నది విషయంలో అదే పద్ధతిని అవలంభిస్తుందని కేటీఆర్ విమర్శించారు.
మూసీ సుందరీకరణ చేస్తే మీకు ఏం ఇబ్బంది వచ్చిందని, నల్లగొండ జిల్లాకు శుద్ధమైన నీరు ఇస్తున్నందుకు మీకు బాధనా..? లక్షా యాభై వేల కోట్లు అని ఎవరు అన్నారు..? మూసీపై డీపీఆర్ సమర్పిస్తే.. కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ.. అనాలోచితంగా ముందుకు పోతున్నారు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఆ 80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన కేటీఆర్
Hyderabad | కిలోమీటర్ దాకా కూలగొడ్తరా.. మూసీ ఎఫ్టీఎల్, బఫర్ దాటి భూసేకరణకు సర్కార్ స్కెచ్
Hydraa | హైడ్రా ఇష్టమొచ్చినట్లు కూల్చుడు కుదరదు.. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు