KTR | హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే రేవంత్ రెడ్డికి దడ పుట్టుకువస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానిని విమర్శించే దమ్ము కూడా సీఎంకు లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
వికారాబాద్‌లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నాయకుడిలాగా.. అంతకంటే ఎక్కువగా మాట్లాడారు. మాకే ఆశ్చర్యం అనిపించింది.. ఆయన బీజేపీలో ఉన్నాడా..? కాంగ్రెస్‌లో ఉన్నాడా..? అని. దేశ రక్షణ మీద సడెన్‌గా ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది వరకు ఆర్మీలో పని చేసిండా.. ఇంకెక్కడ పని చేసిండా అని తెల్వదు కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు. బీజేపీ నాయకుడి కంటే గొప్పగా మాట్లాడారు. ఆశ్చర్యం అనిపింది.. ఎందుకంటే ఏ మూసీని అయితే ప్రక్షాళన చేస్తున్నా అంటున్నడో.. అదే మూసీ పుట్టే ప్రాంతంలో రాడార్ స్టేషన్ పెట్టి 12 లక్షలు చెట్లు, 29 వందల ఎకరాలు ధారాదత్తం చేశారు. నేవికి ఆ ఏరియా అప్పజెప్పితే, స్థానికంగా ఒక కొలువు రాకపోతే.. రాష్ట్రానికి ఏ రకంగా లాభం అవుతుంతో సీఎం చెప్పగలరా..? మూసీకి పురిట్లోనే అన్యాయం చేసి.. కిందకు వచ్చాక న్యాయం చేస్తామంటే ఎవరు నమ్ముతారు..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
గంగా నది జన్మించే గంగోత్రి వద్ద 150 కి.మీ. వరకు ఎకో సెన్సిటివ్ జోన్ అని డిక్లేర్ చేశారు. మరి మూసీ నది వద్ద ఎకో సెన్సిటివ్ జోన్ ఉండదా..? కనీసం 10 కి.మీ. పరిధైనా ఉండదా..? మీరే 2017లో జీవో ఇచ్చారని అంటున్నారు. ఒకటి గుర్తు చేస్తున్నా.. కేబీఆర్ పార్కు చుట్టూ 6 ఫ్లై ఓవర్ల నిర్మాణానికి జీవోలు ఇచ్చాం. టెండర్లు పిలిచాం. ఎస్సార్డీపీలో భాగంగా డిజైన్లు ఫైనల్ చేశాం. ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కలిసి నేషనల్ పార్కు దెబ్బతింటది.. మీ ప్రతిపాదన విరమించుకోండి అంటే మా ప్రతిపాదన విరమించుకున్నాం. రాడార్ స్టేషన్‌కు జీవో ఇచ్చాం.. కానీ 2024 వరకు ల్యాండ్ ఇవ్వలేదు. జీవో ఇచ్చాక తప్పు అని పర్యావరణ ప్రేమికులు చెప్పారు. మోదీ ఒత్తిడి తెచ్చినా, మెడ మీద కత్తిపెట్టినా ఇవ్వలేదు. మీరేమో ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆ భూమిని రాడార్ స్టేషన్‌కు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు.
మరి మేం జీవో ఇచ్చాం కాబట్టి.. ఇస్తున్నాం అని మీరు అంటున్నారు కదా.. మరి మేం ఇచ్చినట్లు రైతుబంధు ఇచ్చావా..? కల్యాణలక్ష్మీ చెక్కులు ఇచ్చావా..? తులం బంగారం పత్తానే లేదు. మేం చేసిన పనులన్నీ మీరు చేస్తున్నారా… రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ఎందుకు పూర్తి చేయడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగి ఉండడం పాలకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం. మాకుంది కాబట్టి ఫ్లై ఓవర్లు ఆపేశాం. దామగుండం భూమి రాడార్ స్టేషన్‌కు ఇవ్వలేదు. బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదు.. మోదీని విమర్శించే దమ్ము లేదు.. మోదీని చూస్తే సీఎంకు దడా.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడకుండా.. ఆఖరికి భట్టి విక్రమార్కతో మాట్లాడించిండు అని కేటీఆర్ గుర్తు చేశారు.
అమెరికా, యూకే లాంటి దేశాలు వద్దన్న టెక్నాలజీని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ప్రజా సమూహాలకు, పర్యావరణానికి ముప్పు ఉందని ఆయా దేశాలు పేర్కొంటున్నాయి. మూసీకి పురిట్లో అన్యాయం చేసి, కింద సుదందరీకరిస్తామంటే ఎవరు నమ్మరు. హైదరాబాద్ ప్రజలను అప్రమత్తం చేయడానికి, పేద ప్రజలకు అండగా నిలబడేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెడుతాం. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు కదులుతారు. ఇబ్బంది కలిగితే స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ను కలవండి. అందుబాటులో లేకపోతే తెలంగాణ భవన్‌కు వస్తే తప్పకుండా న్యాయం లభిస్తుందని కేటీఆర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | ‘హైడ్రా’ వల్ల హైదరాబాద్‌లో భయానక వాతావరణం.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
KTR | కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శలు