KP Vivekananda | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదని, పాలనను గాలికి వదిలేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. గ్రామసభల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్లో కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు.
ప్రజాపాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అని గ్రామసభలు రుజువు చేస్తున్నాయి. గ్యారంటీలపై ప్రజలు చీవాట్లు పెడుతున్నారు. ఎన్ని సార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదు. సీఎం, మంత్రుల తీరుతో అధికారులు బలిపశువులు అవుతున్నారు. ఏ ఒక్క మంత్రి అయినా నిన్న గ్రామ సభల్లో పాల్గొని ప్రజల సమస్యలు విన్నారా..? సీఎం, మంత్రులు రాజభోగాల్లో మునిగితేలుతున్నారు. గాల్లో చక్కర్లు పడుతున్నారు. గాల్లో తిరుగుతూ గాలి నాయకులుగా మారారు. గాల్లో తిరిగే వారికి గ్రౌండ్ రియాలిటీస్ ఏం తెలుస్తాయి. సీఎం విదేశాల్లో.. మంత్రులు రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంత నీచమైన పాలనను ఎప్పుడూ చూడలేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామ సభల్లో ఎవ్వరూ సరైన సమాధానం చెప్పడం లేదు. రాష్ట్రమంతా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా అంతా బాగుందని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం అని కేపీ వివేకానంద పేర్కొన్నారు.
జనవరి 26 నుంచి అమలయ్యే నాలుగు పథకాలకు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని కొత్త లెక్కలు చెబుతున్నారు. మళ్ళీ పథకాలను వాయిదాను వేసే కుట్ర జరుగుతోంది? ఎన్ని సార్లు వాయిదాలు వేస్తారు..? దరఖాస్తులు అంటూ కాంగ్రెస్ నేతల చుట్టూ ప్రజలను తిప్పే కార్యక్రమం జరుగుతోంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇప్పుడు తూతూ మంత్రంగా చేతులు దులుపుకునేలా అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలను రోజుకో డ్రామాతో కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారు. పాలన చేతకాక మభ్య పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సీఎం, మంత్రులు నిద్ర లేచి ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ వహించాలని కేపీ వివేకానంద డిమాండ్ చేశారు.
రేషన్ కార్డు ఆదాయ పరిమితిని పట్టణ ప్రాంతాల్లో మూడున్నర లక్షల రూపాయలకు పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రేషన్ కార్డుకు ఆదాయ పరిమితి పెంచాలి. ఆరున్నర లక్షల రేషన్ కార్డులను ఆన్ లైన్ పద్దతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం లాగా జాతర పెట్టలేదు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని నామకరణ చేస్తే బీఆర్ఎస్ సహించదు. చేతనైతే కొత్తగా ఇండ్లు కట్టి వాటికి ఏ పేరైనా పెట్టుకోండి. ఇప్పటికే కట్టిన ఇండ్లను లబ్దిదారులకు మంజూరు చేయాలి. పేద ప్రజలకు న్యాయం జరిగే దాకా బీఆర్ఎస్ విశ్రమించకుండా పోరాడుతుంది అని కేపీ వివేకానంద తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Dil Raju | ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరుగడం లేదు: దిల్ రాజు
KTR | పద్మారావు గౌడ్‌ను పరామర్శించిన కేటీఆర్
MLA Talasani | తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రజలు అడుగుతున్నారు : ఎమ్మెల్యే తలసాని