ఖమ్మం రూరల్, మార్చి 02 : శాంతి సమాజ స్థాపనకు యుద్ధాలు వద్దు అని అఖిల భారత పీఠాధిపతుల సమైక్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని అన్నారు. కరుణగిరి మహోత్సవాల సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి యందు బిషప్ సగిలి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని పూల ఆంథోని ప్రసంగించారు. ఇప్పుడు ప్రపంచానికి యుద్ధాలు వద్దని శాంతి కావాలని, ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో యేసుప్రభు బోధించిన శాంతి మార్గంలో ప్రయాణించాలన్నారు. మన కోసం ప్రాణాలు అర్పించిన యేసు ప్రభు సహనం, సంతోషం, సఖ్యత అలవర్చుకుని ప్రజలు విభేదాలు మరిచి జీవించాలన్నారు. అంతకు ముందు విద్యార్థుల కోసం వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం నాయుడుపేట నుండి కరుణిగిరి వరకు వాహన ర్యాలీ కోలాటం, డప్పులతో ఊరేగింపుగా వారిని పవిత్ర కరుణగిరి పుణ్యక్షేత్రానికి తోడుకొని వచ్చారు. వీరి వెంట వికారి జనరల్ శౌరి, ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటర్ ఐజాక్, కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ జార్నేసు, ఫాదర్ జయరాజ్, వివిధ సంస్థల ఫాదర్ లు, సిస్టర్లు, సుపీరియర్లు, బ్రదర్లు, సంఘస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరికి ఖమ్మం పీఠం తరఫున సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘు రామరెడ్డి రామ సహాయం, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పి.అనిత, మార్కెట్ చైర్మన్ హరినాధ బాబు పాల్గొన్నారు.

ప్రపంచానికి కావాల్సింది యుద్ధాలు కాదు శాంతి : పూల ఆంథోని