Harish Shankar | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయంగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను చిత్రబృందం భుజాన వేసుకుంది. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ… గతంలో పవన్ సర్ దగ్గరికి వెళ్లాలంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా కారవాన్‌లోకి వెళ్లేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డిప్యూటీ సీఎం హోదా కారణంగా కఠినమైన భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయి. కారవాన్‌లోకి వెళ్లాలంటే ముందుగా ప్రోటోకాల్ ఆఫీసర్లు మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేసి పంపిస్తున్నారు అని తెలిపారు.
ప్రతి రోజు షూటింగ్ ప్రారంభానికి ముందే డాగ్ స్క్వాడ్ వచ్చి మొత్తం సెట్‌ను తనిఖీ చేస్తుందని చెప్పారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా భద్రతా సిబ్బందికి “మనవాళ్లే కదా” అని చెప్పి కొంత సడలింపు ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా, వారు తమ విధి నిర్వహణలో ఎలాంటి రాజీ పడలేదని హరీష్ వెల్లడించారు. షూటింగ్ సమయంలో సీన్స్ వివరించే సమయంలో పవన్ గారి చేయి పట్టుకున్నా, కాస్త జరిపినా వెంటనే నలుగురు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి “అలా చేయొద్దు” అని సూచించేవారని హరీష్ నవ్వుతూ చెప్పారు. “ఇది సినిమా షూటింగ్ సర్, చేయాల్సిందే” అని చెప్పి వాళ్లను ఒప్పించాల్సి వచ్చేదని అన్నారు.
ముఖ్యంగా ఫైట్ సీన్స్ సమయంలో వాడే ప్రతి ఆయుధాన్ని సెక్యూరిటీ అధికారులు పూర్తిగా చెక్ చేసేవారని హరీష్ తెలిపారు. అవి డమ్మీ ఆయుధాలేనని చెప్పినా, అధికారుల తనిఖీలు ఆగలేదని చెప్పారు. భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదనే ఉద్దేశంతో అధికారులు తమ విధులను కచ్చితంగా నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ బాధ్యతల మధ్య కూడా పవన్ కళ్యాణ్ పూర్తి అంకితభావంతో షూటింగ్ పూర్తి చేశారని చిత్రబృందం చెబుతోంది. యాక్షన్, ఎమోషన్, పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతుందని దర్శకుడు హరీష్ శంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా సినిమా షూటింగ్ పూర్తి చేయడం పవన్ కళ్యాణ్ ప్రొఫెషనలిజానికి నిదర్శనమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక మార్చి 26న థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.