ఖమ్మం : నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Tummala ) అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajaykumar ) విమర్శించారు. గతంలో తనపై ‘కాశీం రజ్వీ’ అంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడి వెంట ఉంటూ ఇసుక, మట్టి, భూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఖమ్మం నగర ఖానాపురం హవేలి పరిధి బీఆర్ఎస్ ( BRS ) ఆత్మీయ సమ్మేళన సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పువ్వాడ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఖమ్మం అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకునే విధంగా ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నడూ ‘జై తెలంగాణ’ అనని తుమ్మలను కేసీఆర్ మంత్రిని చేశారని ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు.
తాను ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. పాత కాంగ్రెస్ కంటే కొసరు కొత్త కాంగ్రెస్ నాయకులే ఎక్కువ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఏడాదికే కాలువ సీసీ లైనింగ్ కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజాధనంతో చేపట్టిన ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
మున్నేరుపై తీగల వంతెన, రక్షణ గోడలు, ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణాలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పువ్వాడ తెలిపారు. ఖమ్మం బస్‌స్టాండ్‌ను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తే, దానిపై అనేకమంది విమర్శలు చేశారని అన్నారు. గోళ్లపాడు చానల్‌ను సుందరంగా తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా లాగా ఉందని విమర్శించారు.