హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. మన సంసృతి విశిష్టతను విశ్వవ్యాప్తం చేయడంలో ఎన్నారైలు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని కొనియాడారు. లండన్ వేదికగా నిర్వహించనున్న ‘టాక్ చేనేత బతుకమ్మ-దసరా 2026’ సంబురాల పోస్టర్ను శనివారం హైదరాబాద్లో ఆయన ఆవిషరించారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది సాంసృతిక వారసత్వానికి చిహ్నమని చెప్పారు.
బతుకమ్మ ఉత్సవాలను చేనేతతో ముడిపెట్టి నిర్వహించడం వల్ల నేతన్నలకు చేయూత లభించడంతో పాటు మన వస్త్ర కళా నైపుణ్యం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నదని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాల పండుగలకు నాడు కేసీఆర్ రాష్ట్ర పండుగ హోదా కల్పించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, అధికార భాషా సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, ప్రముఖ రచయిత మానుకోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.