జగిత్యాల, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పాలన చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటు పడబోతున్నదని కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఊహించిందని చెప్పారు. ఒక పార్టీ బీ ఫారం నుంచి గెలిచి మరో పార్టీ బీ ఫారంపై పోటీ చేసిన నాగేందర్‌పై పడే వేటు విషయం చర్చకు రాకుండా కేసీఆర్ భూమి అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్‌కు ఎర్రవల్లి క్షేత్రంలో ఉన్నది 67 ఎకరాలు కాగా, రేవంత్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్రంలో వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సైతం ఇదే తీర్పు వర్తిస్తుందని స్పష్టంచేశారు. గాంధీ భవన్‌కు పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సహా మిగిలిన ఫిరాయింపుదారులు ఎలా వెళ్లారో చెప్పాలని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులకు స్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డిదేనని చెప్పారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం ఉన్నా రేవంత్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలతో సంబంధంలేని సురేఖను మంత్రి పదవి నుంచి బర్త్ఫ్ చేశారని మండిపడ్డారు. సురేఖకు ఒక న్యాయం, రేవంత్‌రెడ్డికి ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగు, తాగు నీరు ఎలా అందించాలనే ఆలోచన చేయకుండా, సమస్యలు పక్కదారిపట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు పోతుందో తెలియక రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు పాల్గొన్నారు.