KP Vivekanand Goud | హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేవలం 14 మందికి మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ తెలిపారు. అర్హులైన అందరికీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టు వేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే దేవుళ్లను మోసం చేస్తున్నాడని ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతు రుణమాఫీకి సమాధానం చెప్పాలని మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసాపై చర్చ పెడుతామని చెప్పి దాటవేశారు. శాసనసభలో తప్పించుకుని పారిపోయారు. రైతు రుణమాఫీపై చర్చ పెడుతామని చెప్పారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టలేదు. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై రైతాంగం వెయి కండ్లతో అసెంబ్లీ వైపు చూసింది. కానీ బడ్జెట్ చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు చర్చ, వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ బడ్జెట్ గ్యాస్ ట్రాష్ అని కేసీఆర్ మొట్టమొదటి రోజే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయలేదు. రైతు రుణమాఫీ విషయంలో పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్లపై ఒట్లు పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. రైతులను వేడుకున్నారు. కానీ రైతులకు లాభం జరగలేదు.. చివరకు దేవుళ్లను కూడా సీఎం మోసం చేసిండు. ఆగస్టు 15 లోపు చేస్తానన్నాడు.. ఇప్పుడేమో నెలఖారు చివరకు వరకు చేస్తామంటున్నాడని ఎమ్మెల్యే వివేకానంద ధ్వజమెత్తారు.
నా నియోజకవర్గంలోని బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించిన బ్యాంకులో 632 మంది రుణాలు తీసుకుంటే అందులో కేవలం 14 మందికి ఇప్పటి వరకు రుణమాఫీ జరిగింది. మొదటి విడతలో 11 మందికి, రెండో విడతలో ముగ్గురికి మాత్రమే మాఫీ అయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఇంత మోసపూరితమైన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు, మోసాలతో నడుస్తోంది. రైతుభరోసాకు నిధులు కేటాయించలేదు. అసెంబ్లీలో అనేక అంశాలపై నిలదీస్తే.. తిట్ల పురాణం అందుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దశదిశ నిర్దేశించే అసెంబ్లీని అప్రతిష్టపాలు చేశారు. చాలా అవమానపరిచారు. కేసీఆర్ నాయకత్వంపై అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేశారని కేపీ వివేకానంద గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌లో జలకళ.. ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల