School Fees | రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. జీవోలు, నిబంధనలు పేరిట నియంత్రణలు విధిస్తున్నట్టు అధికారులు చెప్తున్నప్పటికీ పాఠశాలల దోపిడి ఆగడం లేదు. ఫీజులను నియంత్రిస్తామని (School Fees) ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసింది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.
దీంతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ‘ఆడిందే ఆట.. పాడిం దే పాట’గా అవుతున్నది. అడ్మిషన్ల పేరిట ఫీజుల మోత మోగిస్తున్నాయి. తమ పిల్లలకు ఆంగ్ల మీడియం చదువులు చెప్పించాలనుకునే తల్లిదండ్రులు ఫీజులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని స్కూళ్లల్లో ఎల్కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఫీజులు పెంచడంతో ఓ విద్యార్థి తండ్రి పాఠశాల ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు.
నాగోల్‌కు చెందిన ధర్మారెడ్డి (Dharma Reddy) అనే వ్యక్తి తన కుమారుడిని నాగోల్ (Nagol)లోని అక్షర టెక్నో స్కూల్ (Akshara Techno School)లో చేర్పించాడు. అయితే అక్కడ ఈ ఏడాది ఫీజులు పెంచడంతో తన కుమారుడిని వేరే పాఠశాలలో చేర్పించాలనుకున్నాడు. ఇందుకోసం స్కూల్ ఛేంజ్ చేయడానికి టీసీ, బోనఫైడ్ కోసం పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించాడు. అయితే అందుకు వారు నిరాకరించారు. దీంతో అతడు ‘ధర్మాన్ని రక్షించండి..’ అంటూ ఆందోళనకు దిగాడు. పాఠశాల ముందు అర్ధనగ్నంగా కూర్చొని నిరసన తెలిపాడు.
2009 విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో మొత్తం సీట్లలో 25 శాతం పేద పిల్లలకు ఇవ్వాలి. కానీ, రాష్ట్రంలోని ఏ పాఠశాలలోనూ ఈ నిబంధన అమలు కావడం లేదు. మరోవైపు యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్ పుస్తకాల వ్యాపారానికి ప్రైవేట్ పాఠశాలలు వేదికలుగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌కు భిన్నంగా బోధన జరుగుతున్నది. అయినప్పటికీ అటు ప్రభుత్వం గాని, ఇటు అధికారులు గాని చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. పాఠశాలల యాజమాన్యాల పై చర్యలు చేపట్టాలి.
ధర్మాన్ని రక్షించండి అంటూ ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన
నాగోల్‌లోని అక్షర టెక్నో స్కూల్ ఫీజులు పెంచడంతో తన కుమారుడిని స్కూల్ చేంజ్ చేయడానికి టీసీ, బొనఫైడ్ అడిగితే ఇవ్వడం లేదని, విద్యార్థి తండ్రి ధర్మరెడ్డి స్కూల్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. pic.twitter.com/v1PKFmwit0
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024
Also Read..
DSC Aspirant Gopi | డీఎస్సీ వాయిదా కోరుతూ ఓయూ హాస్టల్ గదిలో అభ్యర్థి నిరాహార దీక్ష
PM Modi | భారత్ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది : ప్రధాని మోదీ
Ramayampet | విద్యార్థినుల అల్పాహారంలో బల్లి.. పలువురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత