PM Modi | రష్యా (Russia)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన ఇవాళ ఆయన మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని.. 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చానని తెలిపారు. భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చినట్లు చెప్పారు. ఇటీవలే మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశానన్న మోదీ.. మూడు రెట్లు వేగంగా పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతానని ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. భారత్ ఘనత ప్రపంచం గుర్తించకతప్పని పరిస్థితి తెచ్చామని వ్యాఖ్యానించారు.
మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వివిధ రంగాల్లో భారత్ సాధించిన అభివృద్ధిని వారికి వివరించారు. ‘ఏ దేశానికీ సాధ్యంకాని విధంగా చంద్రయాన్ ప్రయోగం చేపట్టి విజయం సాధించాం. చంద్రుని దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందాం. దేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తిస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు దేశాన్ని చూసి గర్విస్తున్నారు. డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డ్లను సృష్టించాం. స్టార్టప్‌ల్లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకున్నాం. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయి. భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా వ్యవస్థ భారత్‌లో ఉంది.
భారతదేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తించింది. గత 10 ఏళ్లలో భారత్ సాధించిన అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించాం. పదేళ్లలో 40 వేల కి.మీ. ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేశాం. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించాం. అభివృద్ధిలో 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉంది. టీ20 వరల్డ్ కప్ గెలిచి దేశం సంబరాలు చేసుకుంది. భారత్ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తెచ్చాం. దేశంలోని ప్రతీ ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాం. ఆత్మవిశ్వాసం భారత దేశానికి అతిపెద్ద ఆయుధం. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్ఠమైనది’ ’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు.
Also Read..
Kathua | ప్రతీకారం తీర్చుకుంటాం.. కథువా ఉగ్రదాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్
PM Modi | గోల్ఫ్ కార్ట్‌లో మోదీ – పుతిన్ షికారు.. వీడియో వైరల్
Vladimir Putin | రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి.. విడుదల చేసేందుకు పుతిన్ నిర్ణయం