Health tips : బోడ కాకరకాయ (Spiny gourd) చూడటానికి గుండ్రంగా, ఆకుపచ్చగా, దానిపైన సుతిమెత్తని పిలకలతో ఉంటుంది. ఈ బోడ కాకరకాయలతో కూర వండితే వచ్చే రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే బోడ కాకరకాయ కూరతో రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉన్నాయి. ముఖ్యంగా వానాకాలం (Rainy season) లో బోడకాకర కాయ కూర తినడంవల్ల ఆరోగ్యపరమైన లాభాలు చాలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బోడ కాకరకాయను ఆరోగ్యపరంగా ఉత్తమమైన కూరగాయల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే చికెన్, మటన్ లాంటి మాంసాహారాల్లో కూడా లభించని పోషకాలు బోడకాకరకాయలో లభిస్తాయి. మరీ ముఖ్యంగా వర్షకాలంలో ఈ పోషకాల మోతాదు ఎక్కువ. అందుకే వర్షాకాలంలో బోడ కాకర తినడంవల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు దరిచేరవట. బోడకాకరలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ డైట్లో బోడకాకరను చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
బోడ కాకరలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, అమైనో ఆమ్లాలు, ప్లేవనాయిడ్స్, పోటాషియం, ఫాస్పరస్ లాంటివి ఉంటాయి. అందుకే వర్షకాలంలో తప్పకుండా బోడకాకరను తినాలని అంటారు. డయాబెటిస్ ఉన్నవారు కూడా వర్షాకాలంలో బోడ కాకరకాయ తినడంవల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బోడకాకరలో గ్లైసెమిక్ తక్కువగా ఉండటంవల్ల మధుమేహులకు మేలు చేస్తుంది.
బోడకాకరలో విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫాస్పరస్ లాంటి వాటిని ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది. అందుకే బోడ కాకరను తరచూ తినడంవల్ల క్యాన్సర్ లాంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. అంతేగాక బోడకాకర రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె సమస్యలను కూడా దరిచేరనివ్వదు.
బోడ కాకరలో విటమిన్ సీతోపాటు కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. దాంతో ఇది ఎముకల బలోపేతానికి బాగా పనిచేస్తుంది. బోడకాకరను వర్షాకాలంలో తినడంవల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ లాంటి వాటి నుంచి రక్షణ కలుగుతుంది. బోడ కాకరలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉండటంవల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే బీపీ రోగులకు ఇది మంచి ఔషధమని చెప్పవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా బోడ కాకర చాలా మంచిది. ఈ బోడకాకరను ప్రతిరోజూ తినడంవల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే బోడ కాకరలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దాంతో దీన్ని తరచూ తీసుకోవడంవల్ల త్వరగా కడుపునిండిన భావన కలిగి ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.