కూర్చోవాలంటే తంట.. కూర్చుంటే మంట.. జీవితం సహజంగా ఉండదు. నడక కృతకంగా మారిపోతుంది. కుదురుగా నిలబడలేని దుస్థితి. హాయిగా పడుకుందామన్నా ఒక్కోసారి కుదరదు.. వీటన్నిటికీ కారణం మల విసర్జక వ్యవస్థకు ఎదురయ్యే విపరిణామాలే! అర్షమొలలు, ఫిస్టులా, ఫిజర్స్, మలబద్ధకం లాంటి సమస్యలు మనిషిని పీల్చి పిప్పిచేస్తాయి. సిగ్గుతోనో, భయంతోనో వీటిని బయటపెట్టకపోతే గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు అవుతుంది.
మనిషి జీవితం సాఫీగా సాగిపోవాలంటే వివిధ పోషకాలు ఉన్న ఆహారాన్ని నియమిత వేళల్లో, తగిన మొత్తంలో తినాలి. అలానే శరీర విసర్జక క్రియలు కూడా సాఫీగా జరగాలి. కొన్నిసార్లు అపసవ్యమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మన విసర్జక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతాయి. దీంతో అర్షమొలలు, ఫిస్టులా, ఫిజర్స్, మలబద్ధకం లాంటి సమస్యల బారినపడతాం. విసర్జన సమయంలో మంట, సరిగ్గా కూర్చోలేకపోవడం, రక్తస్రావం లాంటివి రోగులను తీవ్రమైన ఇబ్బందికి, అసౌకర్యానికి గురిచేస్తాయి. వెంటనే చికిత్స చేయించుకోకపోతే సాధారణమైన సమస్యలే ప్రాణాంతకంగా మారతాయి. కాబట్టి, విసర్జక వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు తలెత్తితే సిగ్గు, బిడియం వదిలేసి వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పైల్స్, ఫిస్టులా, ఆనల్ ఫిజర్స్… ఇవి సర్వసాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల ఈ మధ్యకాలంలో పైల్స్, ఫిస్టులా వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు 50 ఏండ్లు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు 20- 30 వయసు వారిలో కూడా తలెత్తుతున్నాయి. వైద్యరంగంలో కొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఇలాంటి సమస్యలపై సరైన అవగాహన లేక చాలామంది రోగులు వ్యాధి ముదిరిన తరువాత దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యలను బయటికి చెప్పుకొనేందుకు సిగ్గుపడి, లోలోపలే ఇబ్బందులు పడుతూ చివరికి ప్రమాదం అంచులకు చేరుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే, గతంతో పోల్చితే ఇప్పుడు చాలామంది మహిళా వైద్యులు అందుబాటులో ఉన్నారు. కాబట్టి పైల్స్, ఫిస్టులా వంటి సమస్యలను సులభంగా నయం చేసుకోవచ్చు.
వీటినే హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో మల విసర్జన ద్వారం ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు ఒత్తిడికి గురై ఉబ్బుతాయి. ఈ విధంగా ఉబికి వచ్చిన రక్తనాళాల గోడలు మలద్వారంలో అడ్డుగా మారి మంట కలిగిస్తాయి. దీంతో మల విసర్జనలో ఇబ్బంది తలెత్తడంతోపాటు రక్తనాళాలు ఒరిపిడికి గురై రక్తస్రావం అవుతుంది. దీంతో రోగి మలద్వారం ప్రాంతంలో తీవ్రమైన నొప్పితోపాటు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడతాడు. పైల్స్… అంతర్గత మొలలు లేదా ఇంటర్నల్ హెమరాయిడ్స్, బహిర్గత మొలలు లేదా ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని రెండు రకాలు.
ఇవి మల విసర్జన ద్వారం లోపల ఏర్పడతాయి. మలద్వారం బయటినుంచి కనిపించవు. సాధారణంగా ఇంటర్నల్ హెమరాయిడ్స్ వల్ల ప్రారంభంలో నొప్పి ఉండదు. నొప్పి లేనప్పటికీ మల విసర్జన సమయంలో రక్తస్రావం జరుగుతుంది. ఈ అంతర్గత మొలలు లోపలినుంచి బయటికి విస్తరించినప్పుడు మాత్రం నొప్పి, మంట ఏర్పడతాయి.
సాధారణంగా కొలరెక్టల్, రెక్టమ్ క్యాన్సర్ల లక్షణాలు పైల్స్, ఫిస్టులా, ఫిజర్స్ లక్షణాలను పోలి ఉంటాయి. దీంతో చాలామంది వచ్చిన సమస్యను పైల్స్గానో లేక ఫిస్టులా, ఫిజర్స్ అనుకుని నాటువైద్యులను సంప్రదిస్తారు. వారేమో రోగుల సమస్యను క్యాన్సర్ అని గుర్తించక పైల్స్, ఫిస్టులా, ఫిజర్స్కు సంబంధించిన చికిత్స చేస్తారు. దీంతో కొలాన్, రెక్టమ్ క్యాన్సర్లు ముదిరిపోయి ప్రాణాల మీదకు వస్తుంది. అందుకని పై వ్యాధులకు సంబంధించిన ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వాళ్లు సూచించిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఇక దవాఖానల్లో మహిళా వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి మహిళలు ఇలాంటి వ్యాధుల విషయంలో బిడియానికి లోను కావాల్సిన అవసరం లేదు.
ఇవి ఆనస్ (మలద్వారం) చుట్టూ ఏర్పడతాయి. ఇవి మలద్వారం వద్ద ఉబ్బెత్తుగా, ముద్దలుగా ఏర్పడతాయి. వాటి దగ్గర దురద, నొప్పి ఉంటుంది. రక్తస్రావం ఏర్పడుతుంది.
పైల్స్, ఫిస్టులా, ఫిజర్స్, కాన్స్టిపేషన్ (మలబద్ధకం)వంటి సమస్యలన్నిటికీ జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం, బైక్‌పై ఎక్కువగా ప్రయాణం చేయడం, నీరు, పీచుపదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మహిళల్లో గర్భధారణ సమయంలో, థైరాయిడ్ వల్ల కూడా ఈ సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
రోగి లక్షణాలు, భౌతిక పరీక్ష ద్వారా సమస్యను వైద్యులు నిర్ధారిస్తారు. సాధారణంగా పైల్స్‌లో 4 దశలు ఉంటాయి. అందులో సమస్య గ్రేడ్-1, గ్రేడ్-2 దశలో ఉంటే మందులు వాడుతూ, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే రోగం నయమైపోతుంది. ఈ దశలో సర్జరీ అవసరం పడదు. ఇక సమస్య గ్రేడ్-3, గ్రేడ్-4 దశలకు చేరుకుంటే మాత్రం శస్త్రచికిత్స తప్పనిసరి. అయితే, గతంలో ఓపెన్ సర్జరీ చేసేవారు. దీనివల్ల కనీసం వారం రోజులపాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. పూర్తిగా కోలుకోవడానికి కనీసం నెలరోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు లేజర్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. దీంతో రోగి అదేరోజు దవాఖాన నుంచి డిశ్చార్జ్ కావచ్చు. రెండుమూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడు.
ఆనల్ గ్లాండ్‌లో ఏర్పడే ఇన్ఫెక్షన్ కారణంగా మలద్వారం వద్ద రంధ్రంలా ఏర్పడుతుంది. దీంతో మలద్వారం వద్ద ఎర్రగా మారి ఆ రంధ్రంలో నుంచి చీము కారుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ మూత్రాశయం వరకు విస్తరించే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను రోగి గుర్తించలేడు. వైద్యులు మాత్రమే నిర్ధారించగలుగుతారు.
మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి ఉంటుంది. మలద్వారం వద్ద నుంచి చీము కారుతుంది. రోగి కూర్చోలేకపోతాడు.
చికిత్సా పద్ధతులు
ఫిస్టులాకు కూడా గతంలో ఓపెన్ సర్జరీ చేసేవారు. దీనివల్ల రోగి కోలుకోవడానికి 2- 3 నెలల సమయం పట్టేది. ఇప్పుడు లేజర్ సర్జరీ ద్వారా కేవలం వారం రోజుల్లోనే రోగి పూర్తిగా కోలుకుంటాడు. సర్జరీ జరిగిన ఒక రోజులోనే దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేస్తారు.
ఇది మలద్వారం లోపలి భాగంలో చర్మంపై చిన్నపాటి పగులులా ఏర్పడుతుంది. దీనివల్ల మల విసర్జనకు ముందు, తరువాత తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, దురద ఏర్పడుతుంది. ఫిజర్స్కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే అది ఫిస్టులాగా మారే అవకాశం ఉంటుంది.
వీఆర్ఎస్ (వీడియో రెక్టోస్కోపి) పరీక్ష ద్వారా సమస్యను నిర్ధారిస్తారు. ఈ సమస్యకు ఫిజరెక్టమీ పద్ధతి ద్వారా చికిత్స చేస్తారు.
ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది.
కొన్నిసార్లు… అంటే సమస్య ప్రారంభదశలో అయితే ఆహారపు అలవాట్లు, ఆహార పదార్థాలను మార్చుకుంటే సమస్య తీరిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం రెక్టో ఆనల్ రిపేర్ (ఆర్ఏఆర్) చేయాల్సి ఉంటుంది.