White Blood Cells | సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టాలన్నా, ఇతర రోగాలు రాకుండా శరీరాన్ని రక్షించాలన్నా మన రోగ నిరోధక వ్యవస్థ ఎంతో పనిచేస్తుంది. నిత్యం సూక్ష్మ క్రిములు శరీరంలో చేరి రోగాలను కలగజేయకుండా అడ్డుకుంటుంది. అందుకు గాను ఆ వ్యవస్థ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే సూక్ష్మ క్రిములను నశింపజేయడంలో తెల్ల రక్త కణాలు ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య సరిగ్గా ఉంటేనే రోగాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ ఎల్లప్పుడూ తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాలు నశిస్తాయి. దీంతో వాటి స్థానంలో కొత్త కణాలను రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేస్తుంది. అయితే అలా తయారు చేయాలంటే రోగ నిరోధక వ్యవస్థకు అవసరం అయిన పోషకాలను మనం అందించాలి. అప్పుడే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక తెల్ల రక్త కణాల ఉత్పత్తికి గాను రోగ నిరోధక వ్యవస్థకు అవసరం అయిన పోషకాలను అందించేందుకు మనం కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
విటమిన్ ఇ ఉన్న ఆహారాలను తింటుంటే రోగ నిరోధక వ్యవస్థకు కావల్సిన బలం లభిస్తుంది. దీంతో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. మనకు రోజుకు దాదాపుగా 60 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ ఇ లభించాలి. ఇందుకు గాను విటమిన్ ఇ అధికంగా ఉండే బాదంపప్పు, అవకాడో, కొత్తిమీర, చేపలు, గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలు వంటి ఆహారాలను తింటుండాలి. వీటిని తింటుంటే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. రోగాలు రాకుండా ఉంటాయి. జింక్ ఉండే ఆహారాలను రోజూ తింటున్నా కూడా తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. జింక్ మనకు రోజుకు సుమారుగా 20 మిల్లీగ్రాముల మోతాదులో అవసరం అవుతుంది. సముద్రపు ఆహారం, తృణ ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల జింక్ లభిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
సెలీనియం మనకు రోజుకు 200 మైక్రోగ్రాముల మోతాదులో కావాలి. ఇది కూడా రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు సహాయం చేస్తుంది. చేపలు, చికెన్, యాపిల్ పండ్లు, వెల్లుల్లి, టమాటాలు, గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. రోజూ గ్రీన్ టీని సేవిస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది. విటమిన్ సి వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య రెట్టింపు అవుతుంది. వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. నారింజ, కివిలు, నిమ్మకాయలు, క్యాప్సికం, పైనాపిల్, బొప్పాయి తినడం వల్ల విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది.
టమాటాలు, నారింజ, బొప్పాయి, చిలగడదుంపలు, క్యారెట్లు, యాపిల్స్ వంటి ఆహారాల్లో కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చూస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. చేపలు, అవిసె గింజెలు, నట్స్‌లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడంలో దోహదపడతాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. విటమిన్ ఎ అధికంగా ఉండే యాపిల్ పండ్లు, క్యారెట్లు, పాలకూర వంటి ఆహారాలను తింటున్నా కూడా మేలు జరుగుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి మనకు రోగాలు రాకుండా చూస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా ఆయా ఆహారాలను తింటుంటే తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకుని రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.