Foods To Take After 40 Years of Age | సాధారణంగా వయస్సు మీద పడే కొద్దీ ఎవరిలో అయినా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీర మెటబాలిజం తగ్గిపోతుంది. శరీరం క్యాలరీలను ఖర్చు చేయలేదు. దీంతో బరువు పెరుగుతారు. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, డయాబెటిస్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 40 ఏళ్లకు పైబడిన వారిలో నెమ్మదిగా ఈ వ్యాధుల ప్రభావం కనిపిస్తుంది. అయితే ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకుంటే ఈ వ్యాధులు రాకుండా వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండవచ్చు. 40 ఏళ్లకు పైబడిన వారు కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గేలా చేస్తాయి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. దీని వల్ల గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. 40 ఏళ్లకు పైబడిన వారు చేపలను తరచూ తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కోడిగుడ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వయస్సు మీద పడే కొద్దీ శరీరంలో క్యాల్షియం మోతాదు తగ్గిపోతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి. అలాగే కండరాలు కూడా బలహీనంగా మారుతాయి. కానీ కోడిగుడ్లను తింటే క్యాల్షియం, ప్రోటీన్లను పొందవచ్చు. దీంతో ఎముకలు, కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో కూడా చురుగ్గా ఉంటారు. బలహీనంగా లేకుండా యాక్టివ్‌గా ఉండవచ్చు.
అవకాడోల్లో మన శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, బీపీ తగ్గేలా చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అవకాడోలను తింటే బరువు తగ్గుతారు. 40 ఏళ్లకు పైబడిన వారు అవకాడోలను తింటే ఎంతో మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, క్రాన్ బెర్రీల వంటి బెర్రీ పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ఫైబర్‌ను అధికంగా కలిగి ఉంటాయి. దీని వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే బాదంపప్పు, వాల్ నట్స్ వంటి గింజలను కూడా రోజూ తింటుండాలి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.
40 ఏళ్లకు పైబడిన వారు రోజూ బీట్రూట్ను తింటుండాలి. బీట్ రూట్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి బీపీని నియంత్రణలో ఉంచుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. శరీరానికి ప్రోటీన్లు లభించేలా చూస్తాయి. దీని వల్ల శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బీట్ రూట్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకుంటే 40 ఏళ్లకు పైబడిన వారు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యాధులు, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.