మా తమ్ముడికి పాప పుట్టింది. తల్లి కడుపులో ఉన్నప్పుడే.. బిడ్డ గుండెలో ఒక ట్యూమర్ మాదిరిగా ఉందని వైద్యులు చెప్పారు. కాకపోతే, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, పుట్టిన తర్వాత పరీక్షలు చేయాల్సి వస్తుందని, అవసరమైతే చికిత్స ఇవ్వాలని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తరవాత స్కానింగ్‌లో గుండె గదిలో ట్యూమర్ ఉన్నట్టుగా గమనించారు. వైద్యుల సిఫారసు మేరకు జెనటిక్ టెస్ట్ చేయిస్తే.. బిడ్డకుట్యుబరస్ క్లిరోసిస్ ఉందని నిర్ధారణ అయింది. ఇంతకీ ట్యుబరస్ క్లిరోసిస్ అంటే ఏమిటి? గుండెలో ఈ ట్యూమర్ ప్రమాదకరమా? సరైన సలహా ఇవ్వగలరు.
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ తమ్ముడి పాపకు ఉత్పన్నమైన సమస్య ట్యుబరస్ క్లిరోసిస్ కావొచ్చు . ఇది ఒక జన్యుపరమైన సమస్య. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా లక్షణాలు చూపుతుంది. కొంతమంది పిల్లల్లో ముఖం మీద చిన్న చిన్న ట్యూమర్స్ లాగా (మొద్దుగా కనిపించే మొటిమలు) కనిపిస్తాయి. కొన్ని పాలిపోయినట్టుండే ప్యాచెస్ రావొచ్చు. ఎక్కువ మందిలో ఫిట్స్ రావడం జరుగుతుంది. ఈ ఫిట్స్ కొన్నిసార్లు అదుపులోకి రాకపోవచ్చు. శరీరం లోపల అవయవాల్లోనూ ట్యూమర్స్ ఏర్పడవచ్చు. పుట్టుకతోనే గుండెలో ర్యాప్డోమయోమా అనే ట్యూమర్ కూడా రావొచ్చు. చాలా సందర్భాల్లో ఈ ట్యూమర్ దానంతట అదే కరిగిపోతుంది.
గుండెలో రక్తం ప్రవహించే దారిని బ్లాక్ చేయనంత వరకు ఈ ట్యూమర్ మరీ ప్రమాదకరమైనది కాదు. తల్లి కడుపులో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేసే వెసులుబాటు ఉంది. మీ విషయంలో అలాంటి పరిస్థితి లేదనిపిస్తుంది. క్రమం తప్పకుండా పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం అవసరం. అలాగే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌కు కూడా పాపను చూపించండి. బిడ్డ ఎదుగుదలను పీడియాట్రీషన్ ద్వారా క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం అవసరం. ఈ సమస్య ఉన్న పిల్లల్లో చాలావరకు అందరిలాగానే ఎదగడం, తమ పనులు చేసుకోవడం జరుగుతుంది. కానీ, రెగ్యులర్ చెకప్‌లు అవసరం. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అందరిలాగా మామూలు జీవితం గడపవచ్చా అంటే.. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, డాక్టర్ సలహాలు పాటిస్తూ, అవసరమైన మందులు సమయానుకూలంగా వాడుకున్నట్లయితే సాధారణమైన జీవితాన్ని గడపవచ్చు. మీ తమ్ముడి పాప విషయంలో తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదన్న దాన్ని బట్టి… భవిష్యత్తు ఉంటుంది. ఆందోళన చెందకుండా పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ని, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌ని సంప్రదించండి.
-డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్