ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఇంతకుముందు పొగతాగేవారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లలోనూ ఆందోళనకరంగా విస్తరిస్తున్నది. అందులోనూ యువతులను అధికంగా ప్రభావితం చేస్తున్నది. పొగతాగే అలవాటు లేకున్నా.. అమ్మాయిల్లో లంగ్ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో సహజంగా ఉండే హార్మోన్లు.. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. లంగ్ క్యాన్సర్ కణాలపైనా ఈస్ట్రోజెన్ గ్రాహకాలనూ కనుగొన్నారు. క్యాన్సర్ కణితి పెరుగుదలను ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రోత్సహిస్తుందని కూడా కొన్ని సర్వేలు తేల్చాయి. ధూమపానం చేయని మహిళల్లో లంగ్ క్యాన్సర్ రావడానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరికొందరిలో స్మోకింగ్ అలవాటు లేకున్నా.. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ (ధూమపానం చేస్తున్నవారి పక్కన ఉండటం) వల్లకూడా నికోటిన్ లాంటి విషపూరిత రసాయనాలకు ప్రభావితం అవుతారు. ఇక రోజంతా ఇంట్లోనే ఉండేవారిలోనూ లంగ్ క్యాన్సర్ కనిపిస్తున్నది. ఇళ్లలో సహజసిద్ధంగా వ్యాపించే రాడాన్ గ్యాస్, వంటింటి వాయు కాలుష్యం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో యువతులలో క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువ స్థాయిలో బయటపడుతుంటాయి. వాటిని చాలామంది ఆస్తమా, శ్వాసనాళాలకు సంబంధించిన ‘బ్రోన్కైటిస్’ సమస్యగా పొరబడుతుంటారు. నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవడం, అలసటను పెద్దగా పట్టించుకోరు. ఇది రోగనిర్ధారణను ఆలస్యం చేస్తుంది. వ్యాధి ముదిరిపోయే దాకా బయటపడకుండా ఉంటుంది. ఈ ఆలస్యం.. చికిత్సకు సవాలుగా మారుతున్నది.
చాలా తక్కువ స్థాయిలో అయినప్పటికీ.. జీవనశైలి మార్పులు, ఇతర అనారోగ్యాలు కూడా మహిళల్లో లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. బయటి ఆహారం ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడంతోపాటు ఊబకాయం కూడా క్యాన్సర్ అభివృద్ధికి కారణం అవుతున్నాయి. జన్యు సమస్యలతోపాటు పర్యావరణ ప్రభావాలు ఈ ప్రమాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ బహుముఖ కారణాలను అర్థం చేసుకోవడం, అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా యువతులలో లంగ్ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు
చెబుతున్నారు.