కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం క్యాబినెట్‌ను దించింది. ప్రజలు, కార్యకర్తలు ఎవ్వరికీ భయపడొద్దు. పిలుస్తే పది నిమిషాల్లో మీముందు ఉంటాం. అందరం కలిసికట్టుగా ఉండాలి. మాగంటి సునీతమ్మను గెలిపించుకోవాలి.
-హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలు కారు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్నాయని, ఎన్నికల తరువాత మీ ఇంటికి కారు రావాలో, బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. అందరి చూపులు జూబ్లీహిల్స్ వైపే ఉన్నాయని, ధోకా తిన్న తెలంగాణకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో మోకా వచ్చిందని, ఇక్కడ కొట్టే దెబ్బకు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదిరిపడాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రహ్మత్‌నగర్‌లోని ఎస్వీఆర్ గ్రాండ్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాధ్తోపాటు మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన, దగాపడిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీకార్డులు పంచాలని కార్యకర్తలకు సూచించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని చెప్పారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్.. అత్తలు, కోడళ్లు, ఆడపిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఇలా అందరినీ మోసం చేసిందని విమర్శించారు. మోసకారి కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలని రాష్ట్రమంతా ఎదురుచూస్తున్నదని చెప్పారు.
విజయం పక్కా.. మెజార్టీయే తేలాలి
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ విజయం పకా అని, మెజార్టీ ఎంత అనేదే తేలాలని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. నెల రోజులు కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి, కలిసికట్టుగా పనిచేసి గులాబీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని, గోపన్న ఆశయాలు నేరవేరాలంటే మాగంటి సునీతాగోపీనాథ్ గెలవాలని పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, ప్రజలు మనవైపు ఉన్నారని, కాంగ్రెస్ మాటలకు మోసపోయినవారు బీఆర్ఎస్ను గెలిపించేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. సమావేశానికి వచ్చే దారిలో తాము ఆగితే.. షబానా, స్వప్న అనే ఇద్దరు ఆడబిడ్డలు దుర్గాదేవి, కాళికామాత లెక్క కాంగ్రెస్ భరతం పడతామని చెప్పారని వివరించారు.
ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూలగొట్టడమా?
ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూలగొట్టడమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సరార్.. ఒక ప్రాజెక్టు కట్టలేదు.. ఒక ఇల్లు కట్టలేదు.. కానీ, హైడ్రా పేరుతో ఎన్నో ఇండ్లు కూల్చివేసిందని దుయ్యబట్టారు. హైడ్రా బుల్డోజర్లు ఆగాలంటే తెలంగాణను గద్దల్లా తింటున్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జీవోలతో 42% బీసీ రిజర్వేషన్ నిలబడదని తెలిసీ నాటకాలాడిన రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు నల్లా బిల్లులు రాలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ముకుపిండి బిల్లులు వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కండ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారెంటీలు వస్తాయని చెప్పారు. ఓటమి భయంతో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించిండ్రు.. మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించిండ్రని కేటీఆర్ మండిపడ్డారు. నెల రోజులపాటు ఇంటింటికీ బాకీకార్డు పట్టుకుని వెళ్లాలని.. దొంగ ఓట్లు పడకుండా అందరినీ ఓట్లు వేసేలా ప్రోత్సహించాలని కార్యకర్తలకు సూచించారు.

రేవంత్‌కు చురక తప్పదు: హరీశ్‌రావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చురుకు తగిలించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రెండేండ్ల పాలనలో రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని అవినీతిమయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే రేవంత్‌రెడ్డికి కనువిప్పు కలుగుతుందని అన్నారు. ఒక రాష్ట్రం ఎలా ఉండాలో కేసీఆర్ చేసి చూపిస్తే.. ఎలా ఉండకూడదో రేవంత్‌రెడ్డి చూపించాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందర కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి, గాంధీ టోపీలు పెట్టి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ 350 బస్తీ దవాఖానలను ప్రారంభించి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలిచారని చెప్పారు. ప్రస్తుతం బస్తీ దవాఖానల పరిస్థితి అధ్వానంగా మారిందని, మందులు ఇచ్చేవారే కరువయ్యారని, వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితిలేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలు, పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగడాలు ఆగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలుచేయకపోయినా, హైడ్రా పేరిటి పేదల ఇండ్ల కూల్చినా తనకు ఓటు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకుంటారని హెచ్చరించారు. వంద రోజులు కాదు 700 రోజులు గడిచినా హామీలు అమలుచేయని కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వివరించారు.
బుల్డోజర్ను ఆపుదాం!
పెద్దోళ్ల ఇండ్లను వదిలేసి హైడ్రాతో పేదల ఇండ్లు కూలగొట్టించారని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అరికెపూడి గాంధీ ఇండ్లు కనిపించకపోవడం ముఖ్యమంత్రికి కనిపించకపోవడం విడ్డూరంగా ఉన్నదని హరీశ్‌రావు విమర్శించారు. గరీబోళ్ల ఇండ్లే హైడ్రాకు కనపడతాయా? అని ప్రశ్నించారు. ‘హైడ్రా ఖతం హోనాహే.. కాంగ్రెస్ కో హరానేహే.. హైడ్రా బంద్ హోనా మే.. మాగంటి సునీతమ్మ కో జితానాహే’ అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బిల్డింగ్ పర్మిషన్‌కు స్వేర్ ఫీట్‌కు రూ.75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 1.2% కమీషన్ ఇవ్వాలని వేదిస్తున్నారని చెప్పారు. ఇల్లు, జాగ, భూముల సమస్యలు పరిష్కారం కావాలంటే 40% భూములు వారికి రాసివ్వాలంటూ పర్సెంటేజీలు డిసైడ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే మీ ఇంటికి బుల్డోజర్ వస్తదని.. అది రావొద్దంటే సునితమ్మను గెలిపించాలని కోరారు. విష్ణువర్ధన్‌రెడ్డి ఎంతో పెద్ద మనసుతో జూబ్లీహిల్స్ ఎన్నికలో మాగంటి సునీతకు తమ్ముడిగా ఉంటూ బీఆర్ఎస్ను గెలిపించడానికి కృషిచేస్తానని చెప్పడం గొప్ప విషయమని అభినందించారు.

రేవంత్ పాలనలో ముస్లింలకు ఒరింగిందేమిటి?
రేవంత్‌రెడ్డివి ధోకా మాటలని, ముస్లింలను కాంగ్రెస్ దారుణంగా మోసంచేసిందని హరీశ్‌రావు విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఏడాది దాటినా అందడంలేదని, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, దళితబంధు, బీసీబంధు, కేసీఆర్ కిట్.. ఇలా అన్నింటినీ ఖతం పట్టించిందని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో ముస్లింలకు డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి పదవులు దక్కాయని గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అందరు కలిసికట్టుగా బీఆర్ఎస్ను గెలిపించి రాష్ర్టాన్ని రక్షించాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో గెలిపించి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
హైడ్రా బుల్డోజర్లు ఆగాలంటే తెలంగాణను గద్దల్లా తింటున్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి.జీవోలతో 42% బీసీ రిజర్వేషన్ నిలబడదని తెలిసీ నాటకాలాడిన రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కండ్లు బైర్లు కమ్మేలా కొడితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయి.
-కేటీఆర్