రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలాంటి ప్రధానమైన పనులెన్నింటినో చేసే కాలేయాన్ని మనం మాత్రం సరిగ్గా పట్టించుకోం. కానీ లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మనం కులాసాగా ఉండగలం. కాలేయ వ్యాధుల వల్ల ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి కూడా. అలాగని దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనం మరీ కష్టపడనక్కర్లేదు… ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి!
చురుగ్గా ఉండండి
రోజువారీ వ్యాయామాలు చేయడం, శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చు. నడక, పరిగెత్తడంలాంటి సాధారణ వ్యాయామాలు చేసినా కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చట. జపాన్‌లోని ఒక విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో వ్యాయామం చేసే వారిలో వివిధ లివర్ వ్యాధులు 9.5 శాతం నుంచి 16.4 శాతం దాకా తగ్గాయని వెల్లడైంది.
గుప్పెడు గింజలు
వాల్నట్, బాదంలాంటి గింజలు కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయం పూట ఏదో ఒక సమయంలో గుప్పెడు గింజలు (దాదాపు 28 గ్రా.) తింటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ని అరికట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంటే, మద్యపానం సేవించని వారిలో వచ్చే ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నమాట. ఈ గింజల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ లాంటివి లివర్ బాగుండేందుకు తోడ్పడతాయి.
పరిశుభ్రత
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పరిశుభ్రత ముఖ్యమైన అంశం. బాత్రూంకి వెళ్లి వచ్చాక, వంట చేసే ముందు, తినే ముందు చేతుల్ని 20 సెకన్ల పాటు శుభ్రంగా కడగడం ద్వారా హెపటైటిస్ ఎ, బి వైరస్ల బారిన పడకుండా ఉండొచ్చు. ఈ వైరస్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి.
ఓ కప్పు బ్లాక్ కాఫీ
రోజూ కాఫీ తాగడం ద్వారా కూడా లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. 2021లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం తరచూ కాఫీ తాగే వారిలో క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం 21 శాతం, ఫ్యాటీ లివర్ ప్రమాదం 20 శాతం, క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల చనిపోయే ప్రమాదం 49 శాతం వరకూ తగ్గినట్టు వెల్లడైంది. రోజుకు మూడు కప్పుల దాకా కాఫీ తాగొచ్చు కానీ, అందులో పాలు, చక్కెరలు మాత్రం ఉండకూడదట.