Health tips : మనం ఆరోగ్యం (Healthy) గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. వేళకు తినడం కూడా అంతే ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు (Vitamins), మినరల్స్ (Minerals), ఫైబర్ (Fiber) లాంటి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. ఇక రోజుకు ఎన్నిసార్లు తినాలనేది సాధారణ అంశం. దీనికి ఒక ప్రామాణికం అంటూ ఏమీ ఉండదు. నిజానికి రోజుకు ఎన్నిసార్లు తినాలనేది వ్యక్తుల శారీరక స్థితినిబట్టి వేర్వేరుగా ఉంటుంది.
సాధారణంగా అయితే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా ఆహారం తీసుకోవడం సముచితమని వైద్యులు చెబుతున్నారు. అయితే సాధారణ బరువు కంటే తక్కువ ఉన్నవారు, ఏదైనా శారీరక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు రోజుకు నాలుగుసార్లు తినడం మంచిదని అంటున్నారు. డయాబెటిక్ పేషెంట్లు కూడా రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వారు ఎక్కువసేపు ఆకలితో ఉంటే సమస్య మరింత పెరుగుతుందని అంటున్నారు.
అదేవిధంగా ఊబకాయంతో బాధపడేవారు లేదా సాధారణం కంటే ఎక్కువ బరువు ఉన్నవారు రోజుకు రెండు లేదా మూడుసార్లు తిన్నా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇక ఎవరైనా సరే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారంలో ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం తక్కువ కేలరీల ఆహారం, సాయంత్రం త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలని అంటున్నారు.
అయితే వ్యక్తులు వారి శారీరక స్థితిని బట్టి రోజుకు ఎన్నిసార్లు తినాలో నిర్ణయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎన్నిసార్లు తీసుకున్నప్పటికీ ప్రతిరోజు నిర్ణీత సమయాన్ని పాటించడం మేలని అంటున్నారు. ప్రతిరోజూ నిర్ణీత సమయంలో తినడంవల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేస్తుందని చెబుతున్నారు.