Salt | నలభీములు చేసినా సరే … ఆ వంటలో సరిపడా ఉప్పు లేనిదే సహించదు. ఊరంత పందిరి వేసి భోజనాలు పెట్టినా… ఉప్పు తగ్గితే మాట దక్కదు. అమృతం తాగిన వాళ్లు మనకు తారసపడలేదు కానీ, బహుశా అది కూడా కొంచెం ఉప్పగా ఉంటుందేమో. ఎంతైనా సాగరగర్భంలోంచి వచ్చింది కదా! ఉప్పు గొప్పలు ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎవరిపట్ల అయినా విశ్వాసం ప్రకటించాలన్నా… ‘మీ ఉప్పు తిన్నాన’నే చెప్పుకొంటారు. కానీ ఇప్పుడు అదే ఉప్పు మన శరీరాన్ని రోగాల పుట్టగా మార్చేసింది. అకాలమరణాలకూ కారణం అవుతున్నది. మన శరీరంలోని ద్రవాలను నియంత్రించే ఎలక్ట్రోలైట్స్ జాబితాలో సోడియందే పైచేయి. మనం తాగే పాల దగ్గరనుంచి తినే పండ్లూ కూరగాయల వరకూ.. ప్రతిదాని నుంచీ ఎంతో కొంత సోడియం అందుతూనే ఉంటుంది. అదనంగా.. పప్పులో, కూరల్లో మనం గుప్పిళ్లకొద్దీ వేసే ఉప్పు నుంచి మరింత అందుతుంది. అదే ఇప్పుడు చర్చలకు దారితీస్తున్నది.
మనిషి ఎప్పుడైతే పచ్చి ఆహారం నుంచి ఓ మెట్టు పైకెక్కి.. కాల్చడం, ఉడికించడం లాంటి పద్ధతులకు మారాడో అప్పటినుంచే ఆహారానికి ఉప్పును జోడించడం మొదలైపోయింది. పదివేల సంవత్సరాలకు పూర్వమే కృత్రిమంగా ఉప్పును తయారుచేసే ప్రక్రియలు ఉన్నట్టు కనుగొన్నారు. ఒకానొక సమయంలో వస్తుమార్పిడిదే ముఖ్యపాత్ర. రోమన్ సైనికులకు.. జీతానికి బదులుగా ఉప్పు ఇచ్చేవారని.. సాల్ట్ నుంచే SALARY అనే పదం వచ్చిందని చెబుతారు. ఉప్పును రుచి కోసమే కాదు.. ఊరగాయలాంటి పద్ధతుల ద్వారా ఆహారం నెలల తరబడి పాడవకుండా ఉండేందుకు వాడేవారు. రిఫ్రిజిరేటర్లు వచ్చేంతవరకు చేపల్లాంటి పదార్థాలు పాడవకుండా ఉప్పే ఆదుకుంది. ఉప్పుకు ఇంత గిరాకీ ఉండేది కాబట్టే.. దాని ఎగుమతి ఓ దేశ ఆర్థికవ్యవస్థలో ముఖ్యపాత్రగా ఉండేది. దానిమీద వేసే పన్నులు రాజకీయంగా పెనుమార్పులకు దారితీసేవి. ఉప్పు వల్ల యుద్ధాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అమెరికన్, ఫ్రెంచ్ విప్లవాలకు ఒకానొక కారణం ఉప్పు మీద అధిక పన్నులు అని కూడా అంటారు. అంతదాకా ఎందుకు.. మన స్వాతంత్య్ర సంగ్రామాన్ని మలుపు తిప్పిన సంఘటనల్లో ఒకటి- ఉప్పు సత్యాగ్రహం! ఇలా చరిత్రనే మార్చిన.. రాచరికాలను, వలసపాలనకు చరమగీతం పాడిన ఘనత ఉప్పుది. అదే ఇప్పుడు మానవజాతి పాలిట శాపంగా మారింది.
Rock Salt
రోజువారీగా ఎంత ఉప్పు తీసుకోవాలి అనేదాని మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ కచ్చితమైన విలువ చెబుతున్నది. రోజుకు 5 గ్రాములకు దాటకూడదని హెచ్చరిస్తున్నది. చేసే పని, వాతావరణం, వయసు, తీసుకుంటున్న మందులను బట్టి ఈ పరిమాణం ఎక్కువ తక్కువ కావచ్చేమో కానీ… సగటు మనిషికి ఈ పరిమితి సరిపోతుంది. ఓ నలుగురు సభ్యులున్న భారతీయ కుటుంబంలో నెలకు కనీసం ఓ కేజీ సాల్ట్ ప్యాకెట్ వాడతాం అన్న చిన్నపాటి విషయాన్ని గుర్తుచేసుకుంటే, ఈ పరిమితిని మనం ఎంతలా దాటేస్తున్నామో అర్థమవుతున్నది. మనం ఇంట్లో నేరుగా వాడే ఉప్పే కాకుండా అప్పడాలు, పచ్చళ్లు లాంటి పదార్థాల్లో… బేకరీ ఫుడ్స్‌లో పిడికిళ్లకొద్దీ ఉప్పు ఉంటుంది. అంటే మన శరీరానికి అవసరమైన దానికంటే మూడునాలుగు రెట్లు అధికంగా సోడియం తీసుకుంటున్నాం.
మనం రుచికి మరిగిపోయి తినేస్తుంటాం కానీ… నింపాదిగా ఆలోచిస్తే, మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందేందుకు తీసుకునేదే ఆహారం అనే విషయం అర్థమవుతుంది. అందుకే పెద్దలు ఆహారమే ఔషధం అని చెప్పారు. ఉప్పదనం ద్వారా మనకు అందే సోడియం ఇందుకు మనహాయింపేమీ కాదు. మన ఒంట్లో ఉన్న ద్రవాలను నియంత్రిస్తూ.. నరాలకు, కండరాలకు సత్తువ అందిస్తుంది సోడియం. మితిమీరిన సోడియం ప్రతి అవయవం మీదా ప్రభావం చూపిస్తుంది. సోడియంకు, మన ఒంట్లో ఉన్న ద్రవానికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టే సోడియంతోపాటు ఒంట్లో నీటి శాతం కూడా పెరుగుతుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా ఉండటం, కాళ్లవాపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక ఉప్పును మూత్రం ద్వారా బయటికి పంపే ప్రయత్నంలో.. నీరు, సోడియంతోపాటు ఇతర లవణాలు కూడా ఒంట్లోంచి బయటికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు శరీరంలో సోడియం ఎక్కువైతే నిద్ర పట్టదు, నిస్సత్తువగా ఉంటుంది, దాహం వేస్తుంటుంది, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక సోడియం వల్ల దీర్ఘకాలికంగా వచ్చే సమస్యలు ప్రాణాంతకాలే.
శరీరంలో పొటాషియం, సోడియంల నిష్పత్తి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దురదృష్టవశాత్తు.. మనం తీసుకునే ఆహారంలో పొటాషియం తగ్గిపోతూ, సోడియం పెరుగుతూ వస్తున్నది. ఇది రక్తపోటుకు దారితీస్తుంది. కిడ్నీల పనితీరునూ దెబ్బతీస్తుంది. రక్తపోటు వల్ల కణాలలో ఇన్సులిన్ అందుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అలా మధుమేహానికి ముఖ్యకారణంగా మారుతున్నది. ఇక రక్తపోటుకు గుండె సమస్యలకు మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. అందుకే 2025 నాటికి మన రోజువారీ ఉప్పు వాడకంలో 30 శాతం తగ్గించుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ తన సభ్యదేశాలను కోరింది.
Salt2
ఉప్పు పట్ల చాలా అపోహలే ఉన్నాయి. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటి గురించి చర్చించింది.
ఎండకాలంలో చెమటలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఉప్పు ఎక్కువగా తీసుకోవాలి: చెమట ద్వారా బయటికి వెళ్లే ఉప్పు మనం ఊహించేదానికంటే తక్కువే. దానికి సరిపడా ఉప్పు ఎలాగూ మన రోజువారీ ఆహారంలో ఉంటుంది. కాబట్టి ఎండకాలం నీళ్లు ఎక్కువ తీసుకోవాలే కానీ ఉప్పు కాదు.
ఆహార తయారీలోనే ఉప్పును వాడితే దాని ప్రభావం తగ్గిపోతుంది: చాలా దేశాల్లో, ప్రజల ఒంట్లోకి చేరుతున్న ఉప్పులో 80 శాతం దాని తయారీ సమయంలో చేర్చిందే!
ఉప్పు బాగా జోడించనిదే ఆహారానికి రుచి రాదు: మనం నాలుకకు ఎక్కువ ఉప్పదనాన్ని అలవాటు చేస్తూ వచ్చాం. క్రమంగా ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే, కొన్నాళ్లకు తక్కువ ఉప్పు కూడా ఇబ్బందిపెట్టదు సరికదా… ఆహారంలోని ఇతర రుచులను మరింతగా ఆస్వాదించగలం.
ఉప్పగా అనిపిస్తేనే ఆహారంలో ఉప్పు వేసినట్టు: తీపి, పులుపు, మసాలా లాంటి గాఢమైన రుచుల మధ్య చాలాసార్లు మనకు ఉప్పదనం తెలియదు. కానీ అందులో కావల్సినంత ఉప్పు వేసే ఉండవచ్చు.
ఉప్పు విషయంలో పెద్దవాళ్లే జాగ్రత్తగా ఉండాలి: ఎక్కువ ఉప్పు ఏ వయసులో అయినా అధిక రక్తపోటుకు దారితీయవచ్చు!
ఉప్పు తగ్గించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది: ఉప్పు పూర్తిగా మానేయడం ప్రమాదకరమే. కానీ మనం తినే రోజువారీ ఆహారం, పండ్లు, బిస్కెట్ల లాంటి పదార్థాల ద్వారా.. రోజువారీ అవసరానికి తగినంత ఉప్పు అందుతుంది.
Micro Particals
అధిక ఉప్పు వల్ల ఏటా 25 లక్షల మంది అకాలమృత్యువు బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్యం కావాలి అంటే… ఉప్పు తగ్గించుకోమంటున్నది. ఇందుకోసం ప్రభుత్వాలు కూడా కొన్ని కఠినమైన నిబంధనలు విధించాలని కోరుకుంటున్నది. వినియోగదారులు కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలని చెబుతున్నది. విద్యాసంస్థలు, కార్యాలయాల్లో కూడా సోడియం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేయడం, అక్కడ అందించే ఆహారం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం లాంటి చర్యలను సూచిస్తున్నది.
Rock Salt1
☞ ప్యాకేజ్ ఫుడ్స్ వద్దు
ఎక్కువ రోజులు నిలువ ఉండేందుకు, రుచి తగ్గకుండా ఉండేందుకు ఇందులో అధికశాతం సోడియం కలుపుతారు. ఒకవేళ ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనదల్చుకుంటే.. అప్పటికప్పుడు తినగలిగే ఆహారాన్ని ఎంచుకోవాలి. వీటిలో సోడియం తగిన మోతాదులోనే ఉంటుంది.
☞ చిలకరించవద్దు
కూరలు, చట్నీల్లో ఉప్పు ఎలాగూ తప్పదు. కానీ ఉప్పు అవసరం లేని ఆహారానికి కూడా జోడిస్తూ ఉంటారు. చపాతీ పిండి కలిపేటప్పుడు, అన్నం ఉడికించేటప్పుడు… ఆఖరికి మామిడి, జామ లాంటి పండ్ల మీద కూడా ఉప్పు చిలకరిస్తారు. ఈ అలవాటుతో చాలా పరిమితికి మించిన సోడియం మన శరీరంలో తిష్ఠ వేసుకుంటుంది.
☞ లేబుల్స్ చూడండి
ఉప్పును నియంత్రించుకోవాలంటే, ఆహారపదార్థాల మీద లేబుల్స్ చూడటం అలవాటు చేసుకోవాల్సిందే. అందులో సోడియం విలువ చూడవచ్చు. ఇప్పుడు చాలా సంస్థలు ‘నో యాడెడ్ సాల్ట్’ అంటూ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా గమనించాలి.
☞ ఉప్పు బదులు
ఏళ్ల తరబడి ఉప్పుకు అలవాటు పడిన నాలుక.. అది తగ్గడాన్ని సహించలేదు. అందుకే రుచిని భర్తీ చేసేందుకు ఉప్పు బదులుగా జీలకర్రపొడి, నిమ్మకాయ, ఆమ్చూర్, మిరియాలపొడి, అల్లం,వెల్లుల్లి, కొత్తిమీర.. లాంటివి చల్లడం వల్ల రుచిని భర్తీ చేయవచ్చు.
☞ ఉప్పు డబ్బాలకు నో ఎంట్రీ
డైనింగ్ టేబుల్ దగ్గర మరో అతిథిలా, అమాయకంగా కనిపించే ఉప్పు డబ్బా మహా ప్రమాదం. అది అందుబాటులో ఉన్న దగ్గర నుంచీ చల్లుకుంటూ ఉంటాం. వాటిని పక్కన పెట్టేస్తే చాలా ఫలితం ఉంటుంది.
☞ ఇంటి భోజనం
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చాక… ఆకలి వేసినప్పుడల్లా యాప్ క్లిక్ చేయడం అలవాటైపోయింది. ఇందులోనూ సహజంగా బేకరీ లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంచుకుంటాం. పైగా బయట తయారుచేసే ఆహారపదార్థాలు నిలువ ఉండేందుకు, రుచిగా తోచేందుకు, అప్పటికప్పుడు వండి డెలివరీ చేసేందుకు ఉప్పును ఎక్కువగా కలుపుతారు. ఆన్లైన్ ఫుడ్ అలవాటు తగ్గిస్తే మంచిది.
☞ పొటాషియం
తగినంత పొటాషియం తీసుకోవడంతో, సోడియం వల్ల కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి. కాబట్టి పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపళ్లు, పాలకూర లాంటి పదార్థాలను మన ఆహారానికి జతచేసుకోవాలి.
☞ వీటికి దూరంగా..
కొన్ని ఆహార పదార్థాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సీఫుడ్, ఫాస్ట్‌ఫుడ్, చీజ్, అప్పడాలు, ఊరగాయలు, సాస్, సూప్, బిస్కెట్లు, బ్రెడ్, నూడుల్స్, వేపుళ్లు… వంటి ఆహారంలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాలలో వాటి రుచి మధ్య అంత ఉప్పు తీసుకుంటున్నాం అని కూడా తెలియదు.
ఓ మూడు దశాబ్దాలలో మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. కదలకమెదలక పనిచేయడం, తీవ్రమైన పని ఒత్తిడి, వేళాపాళా లేని పని, పొల్యూషన్లో గంటల తరబడి ప్రయాణం, ఇరుకుచోట్ల నివాసం… ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపించేవే. ఇలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఆహారాన్ని ఎంచకోవాలి. అందుకు విరుద్ధంగా.. అప్పటికప్పుడు తయారయ్యే, నోటికి ఘాటుగా తోచే ఆహారానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ తప్పుమీద తప్పు మనల్ని అకాలమృత్యువు వైపుగా నడిపిస్తున్నది. ఇందులో ఉప్పే ప్రధాన ప్రతినాయకుడు. రక్తపోటు లాంటి సమస్యలకు మందులు వాడుతున్నవారు, వైద్యుల పర్యవేక్షణలో ఉప్పును తగ్గించే ప్రయత్నం చేయాలి. మిగతావాళ్లంతా ఓసారి రోజులో తీసుకుంటున్న ఉప్పు స్థాయిని గమనించుకుని… వీలైనంతగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
Salt
ఉప్పు గురించి ఎప్పుడైతే అవగాహన పెరుగుతున్నదో… అందుకు ప్రత్యామ్నాయాలు వెతకడం మొదలుపెట్టారు. మరి ప్యాకెట్ సాల్ట్‌తో పోలిస్తే ఇవి ఎంతవరకు నయం!
☞ గళ్ల ఉప్పు: ప్యాకెట్ సాల్ట్‌తో పోలిస్తే ఇందులోనూ సోడియం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే కెమికల్స్ ఉండవు.
☞ లో సోడియం సాల్ట్: దీనిలో పొటాషియం శాతం ఎక్కువ. మోతాదు మించి వాడటం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
☞ రాతి ఉప్పు: దీనికి ఈమధ్యకాలంలో గిరాకీ పెరిగిపోయింది. ముఖ్యంగా హిమాలయన్ రాక్ సాల్ట్ బాగా అమ్ముడుపోతున్నది. ఇందులోనూ సోడియం శాతం తక్కువేమీ ఉండదు. కాకపోతే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్ లాంటి ఇతర లవణాలు పుష్కలం.
➣ ఉప్పు వల్ల ఊబకాయం పెరుగుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఉప్పును బయటికి పంపేందుకు దాహం కలుగుతుందనీ… దాన్ని తృప్తిపరిచేందుకు కూల్‌డ్రింక్స్ లాంటి పానీయాలు తెగ తాగేస్తున్నారని ఓ నివేదిక చెబితే, ఉప్పు తీసుకునేవారిలో యూరియా అవసరం కూడా పెరుగుతుందనీ అందుకోసం ఆకలి ఎక్కువగా వేస్తుందని మరో పరిశోధన హెచ్చరించింది.
➣ ఉప్పు ఎక్కువ తినేవారికి కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతున్నాయో ఈమధ్యే తేలింది. శరీరంలోని అధిక సోడియంని మూత్రం ద్వారా పంపేటప్పుడు, దాంతోపాటు కాల్షియం కూడా
బయటికి వెళ్లిపోతున్నది. ఒంట్లో తగినంత క్యాల్షియం లేకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు, ఎముకలు పెళుసుబారిపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి.
➣ ఉప్పుగా కనిపించేదంతా సోడియం కాదు. ఉప్పగా మన నోటికి అనిపించని పదార్థంలో సోడియం లేదనీ కాదు. ఉదాహరణకు మన టేబుల్ సాల్డ్లో 40 శాతం సోడియం మాత్రమే ఉంటుంది. ఒక స్పూన్ ఉప్పులో 2,300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది కాబట్టి.. అంతకుమించి సాల్ట్ వాడవద్దని నిపుణులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు.
➣ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మధ్యతరగతి, ధనవంతుల జీవనశైలిలో మాత్రమే వచ్చిన మార్పు కాదు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ పరిశోధనలో ఆదిమజాతులు, పేదవాళ్ల ఆహారంలో కూడా ఉప్పు మోతాదు దాటిపోయిందని తేలింది.
➣ పెద్దవాళ్లతో పోలిస్తే నిజానికి పిల్లలు తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ ఇప్పటి పిల్లలు చిప్స్, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్ల ద్వారా ఎన్నో రెట్ల ఉప్పు తీసుకుంటున్నట్టు అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది. ఇందులో భాగంగా పరిశీలించిన ప్రతి తొమ్మిది మంది పిల్లల్లో ఒకరిలో.. రక్తపోటు పరిమితికి మించి కనిపించడం రాబోయే అనూహ్య పరిణామాలకు సూచన.
➣ మనం అధిక ఉప్పుకు అలవాటు పడితే… అంతకంటే తక్కువ స్థాయిని ఇష్టపడం. ఆ సోడియం ప్రభావాన్ని అడ్డుకోవాలంటే పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపళ్లు, బీన్స్, ఆలుగడ్డలు, పాలకూర… లాంటివి తీసుకోవాలి.
మీ పేస్టులో ఉప్పుందా? అని అడుగుతుంది ఓ ప్రకటన. అక్కడితో ఆగకుండా.. మీ ఉప్పులో ప్లాస్టిక్ ఉందా? అని అడిగే రోజులు వస్తాయేమో. కారణం మైక్రోప్లాస్టిక్స్. ఒక అంచనా ప్రకారం మన సముద్రాలలో ఇప్పటిదాకా 5.25 లక్షల కోట్ల ప్లాస్టిక్ ముక్కలు చేరుకున్నాయి. ప్రతిరోజూ 80 లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలు సంద్రంలోకి కలుస్తున్నాయి. ఇవి నీటిలో కరగవు, ఇసుకలో కలవవు. మరింత చిన్న ముక్కలుగా మారతాయి. వీటినే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఉప్పును ఎంతగా శుద్ధి చేసినా… కొంత మైక్రోప్లాస్టిక్స్ చొరబడే అవకాశం ఉంది. ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల మన ఆరోగ్యం ప్రభావితం అవుతుందని ఇప్పుడిప్పుడే మొదలైన పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కేన్సర్ నుంచి గుండెజబ్బుల వరకూ ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎన్నో సమస్యలకు కారణం అవుతాయని సూచిస్తున్నాయి.
“Health tips | ఉప్పు అతిగా వాడితే డిమెన్షియా ముప్పు!”