Health tips : పెరుగు (Curd) అద్భుతమైన పోషకాహారం. ఇందులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులకు పెరుగు అద్భుతమైన మూలం. అందుకే రోజూ పెరుగు తింటే జీర్ణక్రియకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అందుకే శతాబ్దాలుగా భారతీయుల రోజువారీ ఆహారంలో పెరుగు కూడా ఒకటిగా మారింది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు (Health problems) ఉన్నవాళ్లు వర్షాకాలంలో పెరుగు తినకూడదని ఆరోగ్య నిపుణులు (Health experts) చెబుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు శరీరంలోని మూడు దోషాలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. వాత, పిత్త, కఫాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దాంతో శరీరం బలహీనపడి అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. మరి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు పెరుగు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో చల్లని వాతావరణం కారణంగా పెరుగు తింటే జలుబు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం జలుబుచేసే పదార్థాలు జీర్ణక్రియను బలహీనపరుస్తాయి. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు వర్షాకాలంలో పెరుగు తింటే.. అది ఉబ్బరం, అజీర్ణం లాంటి సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా వర్షాకాలంలో పెరుగులో చిటికెడు నల్ల మిరియాలు, వేయించిన జీలకర్ర లేదా తేనె కలపడం మంచిది. లేదంటే జీర్ణశక్తి మందగించే అవకాశం ఉంది.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవాళ్లకు వర్షాకాలంలో పెరుగు మంచిది కాదు. వర్షాకాలంలో పెరుగు శరీరాన్ని మరింత చల్లబరుస్తుంది. ఈ సీజన్లో పెరుగును తీసుకోవడం వల్ల శరీరం చట్టబడి రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. కాబట్టి ఇప్పటికే బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారికి పెరుగు మరింత హాని చేస్తుంది. పెరుగువల్ల శరీరంలో శ్లేష్మం పెరిగి కడుపు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది వేగంగా రోగాలకు గురయ్యేలా చేస్తుంది. అలర్జీలకు కారణం అవుతుంది.
వర్షాకాలంలో పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. అది జలుబు, దగ్గు సహా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు వర్షాకాలంలో పెరుగు తీసుకోవడంవల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దాంతో వైరల్ ఫీవర్లు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
మీకు పెరుగు చాలా ఇష్టమైన ఆహారం అయి ఉండి, వర్షాకాలంలో కూడా తినాలనుకుంటే దానిని సరైన రీతిలో తీసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా పెరుగులో చిటికెడు వేయించిన జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, నల్ల ఉప్పు లేదా తేనెను జోడించాలి. అలా చేయడంవల్ల పెరుగులో చల్లబరిచే గుణాలు క్షీణిస్తాయి. దాంతో వర్షాకాలంలో పెరుగు ఆరోగ్య సమస్యలను పెంచే ముప్పు తగ్గుతుంది. పెరుగులో జీలకర్ర, నల్ల మిరియాలు, నల్ల ఉప్పు, తేనె కలిపి తీసుకోవడంవల్ల జీర్ణక్రియతోపాటు పేగు ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.