Rajnath Singh : అధికార బీజేపీ (BJP) కి మేలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, అందుకు సంబంధించి తన దగ్గర ఆటమ్ బాంబు (Atom Bomb) లాంటి సాక్ష్యం ఉందని శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కౌంటర్ ఇచ్చారు.
రాహుల్‌గాంధీ దగ్గర ఆటమ్ బాంబు ఉంటే పేల్చనిద్దామని, కానీ ఆ పేలుడులో ఎలాంటి హాని జరగకుండా ఆయనను ఆయన కాపాడుకోవాలని రక్షణ మంత్రి ఎద్దేవా చేశారు. ‘రాహుల్‌గాంధీ తన దగ్గర ఆటమ్ బాంబు ఉందంటున్నాడు. ఉంటే ఒకసారి ఆయన దాన్ని పేల్చాలి. అయితే ఆ పేలుడు ఎలాంటి హాని జరగకుండా ఆయనను ఆయన కాపాడుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.
అధికార బీజేపీ కోసం ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతుందంటున్న రాహుల్‌గాంధీ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని రక్షణ మంత్రి హెచ్చరించారు. లేదంటే శనివారం పూట నిప్పుతో ఆడుకోవడమైనా ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్లో భూకంపం సృష్టించబోతున్నాడని గతంలో కూడా ఆయన మనుషులు హంగామా చేశారని రాజ్‌నాథ్ గుర్తుచేశారు.
కానీ రాహుల్‌గాంధీ పార్లమెంట్లో మాట్లాడినా ఎలాంటి భూకంపం రాలేదని, పైగా ఆ ప్రసంగం తడిచిన పటాసు లెక్క తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతికి ఎమర్జెన్సీ రక్తపు మరకలు ఉన్నాయని రాహుల్‌గాంధీ గుర్తుపెట్టుకోవాలని, వైరిపక్షాలపై నోటికొచ్చిన ఆరోపణలు మానుకోవాలని రాజ్‌నాథ్ హితవుపలికారు.