ECI : బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా (Draft voters list) లో తన పేరు లేదని, తాను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలని ఆర్జేడీ అగ్రనేత (RJD
top leader) తేజస్వియాదవ్ (Tejashwi Yadav) ప్రశ్నించడంపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) స్పందించింది. ఓటర్ల జాబితాలో తన పేరు లేదని తేజస్వి యాదవ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, జాబితాలో ఆయన పేరు ఉన్నదని తెలిపింది.
ముసాయిదా ఓటర్ల జాబితాలో సీరియల్ నెంబర్ 416తో తేజస్వియాదవ్ ఓటు ఉన్నదని ఈసీ వెల్లడించింది. కాబట్టి ఓటర్ల జాబితాలో తన పేరు లేదని తేజస్వియాదవ్ చేస్తున్న ప్రచారమంతా శుద్ధ అబద్ధమని పేర్కొంది. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితాను సవరించింది.
అయితే ఈ సవరణపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నదని, ఎస్ఐఆర్ పేరుతో బీహార్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను జాబితా నుంచి తొలగించిందని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తేజస్వి యాదవ్ ముసాయిదా జాబితాలో తన పేరును కూడా తొలగించారని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఆయన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.