Tesla : అగ్రరాజ్యం అమెరికా (USA) కు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా (Tesla) కు ఫ్లోరిడా కోర్టు (Florida court) భారీ జరిమానా విధించింది. 2019లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్పట్లో టెస్లా కంపెనీ పై కేసు నమోదైంది. టెస్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థ (Autopilot system) లో లోపంవల్లే ఆ ప్రమాదం జరిగిందని తాజాగా ఫ్లోరిడా కోర్టు తేల్చింది. బాధిత కుటుంబానికి 240 మిలియన్ డాలర్ల పరిహారం (భారత కరెన్సీలో సుమారుగా రూ.1,996 కోట్లు) చెల్లించాలని టెస్లాను ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని కీ లార్గోలో 2019 లో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. జార్జ్ మెక్ గీ అనే వ్యక్తి తన టెస్లా కారులో వెళుతూ అత్యాధునిక ఆటో పైలట్ ఫీచర్‌ను ఉపయోగించాడు. ఇది టెస్లా అందించిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థ. మార్గమద్యంలో జార్జ్ మొబైల్ కారులో కింద పడిపోయింది. కారు ఆటో పైలట్ మోడ్‌లోనే ఉండటంతో జార్జ్ కిందకు వంగి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
దాంతో ఆ కారు అదుపు తప్పి పక్కనే పార్క్‌చేసి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఆపై ఇద్దరు వ్యక్తులపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ ప్రమాదానికి నష్టపరిహారంగా బాధిత కుటుంబాలకు మొత్తం 329 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు కారు యజమానిని ఆదేశించింది.
అయితే ప్రమాదానికి ఆటో పైలట్ వ్యవస్థ లోపం కూడా ఒక కారణమని గుర్తించిన కోర్టు.. ఆ మొత్తం పరిహారంలో 242 మిలియన్ డాలర్లను టెస్లా కంపెనీ చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. ప్రమాదానికి కారకుడైన కారు యజమాని మిగతా మొత్తం చెల్లించాలని స్పష్టంచేసింది. అయితే ఫ్లోరిడా కోర్టు తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేయనున్నట్లు టెస్లా సంస్థ తెలిపింది.