మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Jul 14, 2020 , 17:18:16

కొవిడ్‌ నుంచి కోలుకున్నా పీటీఎస్‌డీ వేధిస్తోంది..!

కొవిడ్‌ నుంచి కోలుకున్నా పీటీఎస్‌డీ వేధిస్తోంది..!

లండన్‌: కొవిడ్‌ మహమ్మారి మానవజాతి సమస్తాన్ని పీల్చిపిప్పి చేస్తోంది. ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటున్న ఈ వ్యాధి గురించి రోజుకో చెడువార్త వినిపిస్తోంది. రోగులపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు అది చూపే దుష్ప్రభావాలను చూసి, ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న కొంతమంది రోగుల్లో పీటీఎస్‌డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) అనే దీర్ఘకాలిక మనోవ్యాకులత లక్షణాలు కనిపిస్తున్నాయని ఓ తాజా అధ్యయనంలో తేలింది.  ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయిన 40% మంది రోగులు ఆందోళనతో బాధపడుతున్నారని, 30% మందిలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయని, 20% మందికి పీటీఎస్‌డీ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. 

కొవిడ్‌తో బాధపడుతూ, ఐసీయూలో చేరిన రోగులందరూ తప్పకుండా పీటీఎస్‌డీ పరీక్షలు చేయించుకోవాలని కింగ్స్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఇజ్రాయెల్ హైఫా విశ్వవిద్యాలయం, యూకే నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన మానసిన నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా కొవిడ్‌ ట్రామా రెస్పాన్స్‌ గ్రూప్‌లోని సభ్యులు. కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతి రోగి మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధవహించాల్సిన అవసరముందని వీరు సూచిస్తున్నారు. దవాఖాన ఆరోగ్య సిబ్బంది రోగుల శారీరక పునరుద్ధరణపై మాత్రమే దృష్టిపెడతారని, మానసిక అవసరాలను వారు పరిగణనలోకి తీసుకోరని, వాళ్లకు అంత సమయం కూడా ఉండదని పేర్కొన్నారు. అందుకే ఐసీయూ నుంచి డిశ్చార్జ్‌ అయిన వ్యక్తికి కచ్చితంగా మానసిక నిపుణులచే కౌన్సెలింగ్‌ ఇప్పించాలని సూచిస్తున్నారు.  

నిరంతర భయం, సిగ్గు, కోపం లేదా అపరాధ భావన, నిర్లిప్తత, ఇంతకుముందు అలవాట్లకు దూరంగా ఉండడం, ప్రతికూల భావనలు, చిరాకు, దూకుడుగా వ్యవహరించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆశ్చర్యకరమైన ప్రతిస్పందనలు, ఏకాగ్రత సమస్యలు, నిద్రపట్టకపోవడంలాంటివి పీటీఎస్‌డీ వచ్చేందుకు సంకేతాలని నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి లక్షణాలుగనుక రోగిలో గుర్తిస్తే వెంటనే మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలని పేర్కొంటున్నారు. లేకుంటే సదరు రోగి పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌కు గురవుతాడని హెచ్చరిస్తున్నారు.  ఇది ఆత్మహత్య ధోరణిని ప్రేరేపించే ప్రమాదముందని పేర్కొంటున్నారు. 

  logo