e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News మీకు డ‌యాబెటిస్ ఉందా? జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. లేదంటే..

మీకు డ‌యాబెటిస్ ఉందా? జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. లేదంటే..

diabetic foot ulcer | ఆధునిక జీవనశైలితో మధుమేహం ఓ తీవ్ర సమస్యగా మారింది. రోజురోజుకూ వ్యాధిగ్రస్థుల సంఖ్య అధికం అవుతున్నది. అయితే, జనంలో అవగాహన పెరగడం వల్ల మధుమేహం పట్ల భయాలు తొలగిపోయాయి. కానీ, ఆ మహమ్మారి ఒంటరిగా దాడిచేయదు. రుగ్మతల మూకను వెంటబెట్టుకొని వస్తుంది. ఆ గుంపులోని మరో ప్రతినాయకుడు.. డయాబెటిక్‌ ఫూట్‌ అల్సర్‌. అజాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్‌ పెరిగిపోతుంది. ఒక్కోసారి కాలు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. శరీరానికి తీవ్ర నష్టం కలిగించే ‘డయాబెటిక్‌ ఫూట్‌ అల్సర్‌’ గురించి జనంలో అవగాహన తక్కువే.

diabetic foot ulcer
diabetic foot ulcer

ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 47 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. 2045 నాటికి ఈ సంఖ్య 70 కోట్లకు చేరనుందనీ అంచనా. ఆ అనారోగ్య భారంలో అధికభాగం భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలే మోస్తున్నాయి. ‘ప్రపంచ మధుమేహ రాజధాని’ భారతదేశంలో చక్కెర వ్యాధి బాధితుల సంఖ్య 7 కోట్ల 70 లక్షలు. ప్రజల జీవిత కాలం పెరగడం, అపసవ్య జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా 2025 నాటికంతా ఈ సంఖ్య 13 కోట్లను దాటుతుందని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం విస్తరించినకొద్దీ డయాబెటిక్‌ ఫూట్‌ అల్సర్‌ కూడా చాపకింద నీరులా పాకిపోయినట్టే.

కాలి అడుగున పుండు

- Advertisement -

ఇన్సులిన్‌ లభ్యత, నాణ్యమైన చికిత్సల వల్ల మధుమేహ బాధితులు నోరు కట్టేసుకోవాల్సిన అవసరం తప్పి పోయింది. కోమాలోకి వెళ్తారన్న భయమూ తీరిపోయింది. కాకపోతే వయసు పెరగడం వల్ల వచ్చే దృష్టిదోషాలకు దారితీసే రెటినోపతి, కిడ్నీల వైఫల్యానికి కారణమయ్యే నెఫ్రోపతి, నరాల బలహీనతకు బాటలు వేసే న్యూరోపతి, రక్తనాళాల సమస్యలకు సంబంధించిన పెరిఫెరల్‌ వాస్క్యులర్‌ వ్యాధుల నుంచి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చాలామంది అంతగా పట్టించుకోని మరో గండం.. డయాబెటిక్‌ ఫూట్‌ అల్సర్‌. అంటే మధుమేహ రోగులకు కాలి అడుగులో ఏర్పడే పుండు. దీన్ని విస్మరిస్తే ఇన్ఫెక్షన్‌ పెరిగి పెద్దదవుతుంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలకుపైగా కేసులలో కాళ్లను తీసేయాల్సి వస్తున్నది. వీరిలో 70 శాతం వరకు మధుమేహ బాధితులే కావటం డయాబెటిక్‌ ఫూట్‌ అల్సర్‌ తీవ్రతను వెల్లడిస్తున్నది.

 diabetic foot ulcer
diabetic foot ulcer

ప్రాణాలకూ ముప్పు

ఇతరులతో పోలిస్తే మధుమేహ రోగుల కాళ్లకు గ్యాంగ్రీన్‌ (మాంసం కుళ్లిపోవడం) ముప్పు 17 రెట్లు ఎక్కువ, కాళ్లను తొలగించే ఆస్కారం 5 నుంచి 6 రెట్లు అధికం. ఇక టీనేజ్‌లోనే మధుమేహం బారినపడిన వారికైతే.. యాభై ఏండ్లకు చేరుకునే సరికి కాళ్లను తీసేయాల్సిన పరిస్థితి మరీ ఎక్కువని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అంతేకాదు.. ఒకసారి కాలు తీసేశాక, 3 ఏండ్లలో మరో కాలు తీసేయాల్సిన ముప్పు 30 నుంచి 40 శాతం పెరుగుతుంది. కాలు తీసేశాక, సంభవించే మరణాల రేటు మొదటి ఏడాది 11నుంచి 41 శాతం మధ్య ఉంటే 3 నుంచి 5 సంవత్సరాల మధ్య 20 నుంచి 50 శాతం నుంచి 39 నుంచి 68 శాతానికి పెరుగుతుంది. ప్రతి 30 సెకండ్లకూ మధుమేహం కారణంగా ప్రపంచంలో ఎవరో ఒకరు, ఏదో ఓ కాలు కోల్పోతూనే ఉన్నారు.

రోగి పాత్రే కీలకం

ఫూట్‌ అల్సర్‌ విషయంలో ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్లాలన్న దానిపై రోగులు ఇప్పటికీ అయోమయంలో ఉన్నారు. ఫిజీషియన్లకు సైతం ఏ నిపుణుడికి సూచించాలన్న స్పష్టత ఉండటం లేదు. వాస్క్యులర్‌ సర్జన్లు బాగా చికిత్స చేస్తారని సాధారణ సర్జన్లు అనుకుంటారు. వారి దగ్గరేమో చికిత్సకు తగిన ఆధునిక సదుపాయాలు ఉండక పోవచ్చు. పరిస్థితి తీవ్రతకు ‘మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌’ (ఒకేసారి భిన్న వైద్య విభాగాల నిపుణుల సేవలు తీసుకోవడం) సరైన సమాధానంగా కనిపిస్తున్నది. ఈ విధానంలో రోగి కీలకపాత్ర పోషిస్తాడు. కానీ, ఆరోగ్య చైతన్యం అంతంత మాత్రంగానే ఉన్న భారత్‌లాంటి చోట్ల అదంత సులభం కాదు. చికిత్సలకు సంబంధించి ప్రజల్లో ఎన్నో సందేహాలు, భయాలు ఉన్నాయి. ఫలితంగా, సులువుగా పరిష్కారమయ్యే దశ నుంచి కాలికి గ్యాంగ్రీన్‌ దాపురించే తీవ్ర స్థితి వరకూ వెళ్తున్నది వ్యవహారం. ప్రాథమిక స్థాయిలో చికిత్స చేసే వైద్యుడికి మధుమేహం, డయాబెటిక్‌ ఫూట్‌ గురించి లోతైన అవగాహన ఉంటే, ప్రస్తుత పరిస్థితిని కొంతమేర మార్చవచ్చు. కాళ్లు తీయాల్సిన అనివార్యతను 45 నుంచి 85 శాతం వరకు తగ్గించవచ్చు. అన్నిటికీ మించి, డయాబెటిక్‌ ఫూట్‌ గురించి ప్రతి మధుమేహ రోగీ క్షుణ్నంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.

 diabetic foot ulcer
diabetic foot ulcer

చికిత్సలు

న్యూరోపతి, ఇస్కీమియా, ఇన్ఫెక్షన్‌ రూపంలో డయాబెటిక్‌ ఫూట్‌కు సంబంధించి మూడు పెద్ద సమస్యలు ముంచుకొచ్చాయి. న్యూరోపతిక్‌ అల్సర్‌ చికిత్స విషయంలో గణనీయమైన పురోగతినే సాధించాం. అయినా, మూడోవంతు రోగులు కోలుకోవడం కష్టమైపోతున్నది. ఇక న్యూరో ఇస్కీమిక్‌ ఫూట్‌ (గుండె నుంచి కాలి అడుగు భాగానికి సాఫీగా రక్త సరఫరా జరగని పరిస్థితి) విషయంలో కూడా బైపాస్‌ సర్జరీ, యాంజియోప్లాస్టీ రూపంలో రీవాస్క్యులరైజేషన్‌ పద్ధతులు రోగి పరిస్థితిని మెరుగుపరుస్తాయి. కాలి ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఎదురయ్యే సవాళ్లకు ఎంఆర్‌ఐ, ఎంఆర్‌ఎ, శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్‌ ఉత్తమ పరిష్కారాలుగా నిలుస్తున్నాయి.

మెరుగైన పరిశోధనతో

మధుమేహ రోగులు ఆ వ్యాధి దుష్ఫ్రభావం ఫలితంగా, మరిన్ని రుగ్మతలతోనూ బాధపడుతుంటారు. దీంతో న్యూరోపతి, ఇన్ఫెక్షన్‌ సమస్యల కారణంగా కాలు తీసేయాల్సిన పరిస్థితి తరచూ దాపురిస్తుంది. రోగికి మధుమేహంపై ఉన్న అవగాహన, న్యూరోపతిక్‌ సమస్యల స్వభావం, వాటి చికిత్సకు సంబంధించి ఫిజీషియన్‌ నైపుణ్యం.. ఈ మూడూ సమర్థంగా ఉంటే, మధుమేహం వల్ల వచ్చే ఎన్నో సమస్యలను నివారించవచ్చు. దీంతోపాటు, అధునాతన చికిత్సా వ్యూహాలనూ అమలుచేయాల్సి ఉంటుంది. మధుమేహ రోగుల్లో కాళ్లు తీసేయాల్సిన అనివార్యతను 50 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా.. అంతర్జాతీయంగా ‘సెయింట్‌ విన్సెంట్‌ డిక్లరేషన్‌’ను ప్రకటించారు. ఇది జరిగి 20 ఏండ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ ఈ లక్ష్యం సుదూర స్వప్నమే. ఈ పరిమితులన్నీ అధిగమిస్తే ..డయాబెటిక్‌ ఫూట్‌ను ఉక్కు పాదం కింద అణచేయవచ్చు.

డాక్టర్‌ దేవేందర్‌ సింగ్‌,

సీనియర్‌ వాస్క్యులర్‌ & ఎండోవాస్క్యులర్‌ సర్జన్‌

యశోద హాస్పిటల్స్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

మీకు షుగ‌ర్ ఉందా..? అయితే, ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించాల్సిందేన‌ట‌..!!

Diabetes and Sugar : చక్కెర తినడం వల్లనే డయాబెటిస్‌ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!

Health tips : మ‌ధుమేహులూ ఎంచ‌క్కా ఈ పండ్లు తినొచ్చు!

diabetes | డ‌యాబెటిస్ ఉంటే పెళ్లి త‌ర్వాత ఈ విష‌యాల్లో ఇబ్బందులే !!

Diabetes | ఫాస్ట్‌ఫుడ్ తింటే డ‌యాబెటిస్ వ‌స్తుందా?

Diabetic eye : కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement