ఆదివారం 01 నవంబర్ 2020
Gadwal - Oct 02, 2020 , 02:57:07

నిరంతరంగా నీటి విడుదల

నిరంతరంగా నీటి విడుదల

  • ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
  • జూరాల 7, శ్రీశైలం 7 గేట్లు ఎత్తివేత
  • ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలకూ భారీగా ఇన్‌ఫ్లో

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: జూరాలకు స్థిరంగా వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌లో 7గేట్లను ఎత్తి దిగువకు 48,860 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఇన్‌ఫ్లో 87,800 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 85,362 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులుండగా ప్రస్తుతం 1043.307అడుగులతో పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 8.611టీఎంసీలుగా ఉన్నది.  పవర్‌హౌస్‌కు 34,772 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ, సమాంతర కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. ఇన్‌ఫో 38,922క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 38,922 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1704.72 అడుగులకు చేరింది. సామర్థ్యం 128.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 54,503 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 54,940 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ ప్రస్తుతం 1614.63అడుగులకు చేరింది. సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా 37.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

తుంగభద్రకు పెరిగిన వరద

అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువన ఉన్న తుంగ జలాశయం ద్వారా 5,062 క్యూసెక్కులు చేరుతుంది. దీంతో ఐదు గేట్లను ఎత్తి 12,064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం ఇన్‌ఫ్లో 24,808 క్యూసెక్కులు నమోదుకాగా, అవుట్‌ఫ్లో 24,544 క్యూసెక్కులు ఉంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి అదే స్థాయిలో నీటి మట్టం నిల్వ ఉంచుతున్నట్లు తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ వెంకట రమణ తెలిపారు. 

ఆర్డీఎస్‌ ఆనకట్టకు .. 

కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద కొనసాగుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు వాగులు, వంకల ద్వారా ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద నీరు చేరుతోంది. గురువారం ఆర్డీఎస్‌ ఆనకట్టకు 26,330 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా, 25,600 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 730 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 10 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.  

శ్రీశైలంలో జలసవ్వడి : 7 గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీశైలం: ఎగువ రాష్ర్టాలైన మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్ట్‌లలో వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ శ్రీశైలానికి చేరుకుంటుంది. గురువారం సాయంత్రం శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువ ప్రాజెక్టుల నుంచి లక్ష యాభై వేలకు పైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో డ్యాం ఏడు గేట్లను పది అడుగుల ఎత్తులో తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 96,223 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 53,313 క్యూసెక్కులు, హంద్రి నుంచి 37,027 క్యూసెక్కుల (మొత్తం 1,85,563 క్యూసెక్కులు)నీరు శ్రీశైలానికి విడుదల చేయగా రాత్రి తొమ్మిది గంటల వరకు 2,34,949 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తులో తెరిచి 1,95,881 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 30,718 క్యూసెక్కుల (మొత్తం 2,26,599 క్యూసెక్కులు) వరద నీటిని దిగువన ఉన్న సాగర్‌ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఏపీ పవర్‌ హౌస్‌ ద్వారా 31,058 క్యూసెక్కుల నీటిని వినియోగించి 15.301 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు సీఈ నర్సింహారావు తెలిపారు.