అల్పులకు, అర్భకులకు, అంతుచిక్కనివారి ఊహలకు కూడా అందని అద్భుతమైన వ్యుహకర్త కేసీఆర్. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఇది ఎన్నోసార్లు రుజువైంది. అంత ఈజీగా అందరికీ అర్థమైతే ఆయన కేసీఆర్ ఎలా అవుతారు? కారు కదా?
రాజ్యాంగం విషయంలో కేసీఆర్ చేసిన ప్రతిపాదన, వెలిబుచ్చిన అభిప్రాయంపై చాలా చర్చే జరుగుతున్నది. అయితే అలవోకగా లేదా వ్యూహం లేకుండా అభిప్రాయాలు వ్యక్తం చేసేంత అమాయకుడు కాదు కదా కేసీఆర్? వందకు వంద శాతం దీర్ఘకాలిక వ్యూహం, ఒక లక్ష్యం తప్పకుండా దీనివెనుక ఉంటుందని మెల్లమెల్లగా, ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతున్నది. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రోజుకింత పలుచబడుతున్న దృశ్యం దేశవ్యాప్తంగా ప్రజలకు కనిపిస్తూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో బీజేపీకి జరిగిన ఘోర పరాభవం, ఈ మధ్యనే కర్ణాటక, పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలబడటం మనందరికీ తెలిసిందే.
గతంలో ఎదురులేకుండా గెలిచిన యూపీలో బీజేపీ ఇప్పుడు ఎదురుగాలులు ఎదుర్కొంటున్న దృశ్యం కూడా మనకు కనబడుతున్నది. దేశంలోని నిరుపేదలకు, కర్షకులకు, కార్మికలోకానికి, ప్రభుత్వ ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు బీజేపీ తన విధానాలతో విసుగు పుట్టిస్తున్నది. ఈ వర్గాల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది.
2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవిచూడబోతున్నదని కేసీఆర్ నిర్ధారణకు వచ్చారు. మోదీ సర్కార్ అవలంబిస్తున్న పాలసీలను సమూలంగా మార్చి దేశ ఆర్థిక ప్రగతికి, తద్వారా దేశప్రజల ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడాలనే ఆలోచనతో ఉన్నారు. ఇందుకు తగిన రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగపరమైన మద్దతు అవసరం. లేకపోతే చైనా, జపాన్, తూర్పు ఆసియా తదితర దేశాల పద్ధతుల్లో మన దేశాన్ని పురోగమింపజేయడం సాధ్యం కాదు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తాననే విశ్వాసంతో ఉన్న కేసీఆర్ అందుకు అవసరమైన వ్యూహానికి ఇప్పటినుంచే శ్రీకారం చుడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్యాంగం పట్ల తాను చేస్తున్న వ్యాఖ్యలపై కొంతమంది ఒట్టిగానే మొరుగుతారని కూడా ఆయన ముందే తెలియజేశారు. రాజకీయపార్టీలు, వాటి ఉద్దేశాలు సమాజం ముందుకురావాలని, వాటి ఆలోచనలు, అవగాహనలు దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆయన నూతన రాజ్యాంగం అనే రాయిని విసిరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి అర్భకుడి రూపంలో తాము ప్రగతి కాముకులము కాదని, తాము అధికారంలోకి వచ్చినా ప్రగతి కాముక ఆలోచనలు చేయబోమని తమ అర్భకత్వాన్ని నగ్నంగా ప్రజల ముందు వెలిబుచ్చారు. నిరాహారదీక్షలు వగైరాలతో రేవంత్రెడ్డి అర్భకత్వం బయటపడింది. ఇంకా అనేక పార్టీలు, అనేక వ్యక్తులు తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. కేసీఆర్ కోరుకున్నది కూడా ఇదే. ఈ
అంశంపై స్పష్టమైన విధానం ఏమిటో, ఎందుకు తాను ఈ ప్రతిపాదన చేశారో భవిష్యత్తులో కేసీఆర్ ప్రజలకు తెలియజేస్తారు.
మహామహులకే సాధ్యం కాని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అవలంబించిన వ్యూహాలు, సమైక్యవాదులతో ‘జై తెలంగాణ’ నినాదం చేయించిన ఆయన చాణక్యం మనమందరం కండ్లారా చూశాం. కేసీఆర్ అనుకున్నవి రెండు లక్ష్యాలు. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన. రెండు ప్రగతి కాముక రాష్ట్రంగా తెలంగాణ నిలదొక్కుకోవటం. మొదటి లక్ష్యాన్ని సాధించారు. రెండో లక్ష్యాన్ని చేరుకున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అని ఇప్పుడు తెలిసిందా?
ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ఆహ్వానించకపోవడం అభ్యంతరకరమని, బీజేపీ నేతలు, సోషల్ మీడియా అసాంఘిక శక్తులు ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అని వాళ్లకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రజలు ఎన్నుకొన్న రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న కేసీఆర్ను ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా సభ్యసమాజం విస్తుపోయేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులకు.. అలా మాట్లాడేవారిని పార్టీలో చేర్చుకొంటున్న.. పక్కన కూర్చొబెట్టుకొంటున్న కేంద్ర నాయకులకు.. తామొక ప్రజా నాయకుడు, ఉద్యమనాయకుడు, రాష్ట్ర సాధకుడిని అనగూడని మాటలు అంటున్నామనే ఇంగితజ్ఞానం అప్పు డు లేదా? తాము ఒక ముఖ్యమంత్రిని ఇలా అగౌరవపరచకూడదనే జ్ఞానం వారిలో ఎందుకు లేదు? ప్రధానిని ముఖ్యమంత్రి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నిస్తున్న వారు.. తాము కేసీఆర్ను ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్నారా లేదా అన్న ప్రశ్నకు ముందు జవాబు చెప్పి మాట్లాడాలి. – ఒక వాట్సాప్ సందేశం
ప్రజాజీవితంలో అనేక హోదాలలో పనిచేసిన కేసీఆర్ అంత అమాయకంగా నూతన రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిపాదన చేస్తారనుకోవడం అర్భకత్వం,
అమాయకత్వమే.
(సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్స్)